ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్ల కొనుగోలు.. అక్కడ తక్కువ.. ఇక్కడ ఎక్కువ ఎందుకు..? - ఎస్పీడీసీఎల్​ టెండర్లు

SHIRIDI SAI ELECTRICAL COMPANY : రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని శాసిస్తున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం.. అడ్డగోలుగా ప్రజాధనాన్ని.. దోచిపెడుతోంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లనూ ఆ సంస్థ నుంచి డిస్కంలు అధిక ధరలకు కొంటున్న వ్యవహారం .. వెలుగులోకి వచ్చింది. GST, రవాణా ఛార్జీలు కలిపి లక్షా 39 వేల 999 రూపాయల చొప్పున.. 10 వేల ట్రాన్స్‌ఫార్మర్లు కొనేందుకు దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ షిర్డిసాయి సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలోని ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే రెట్టింపనే విమర్శలున్నాయి.

SHIRIDI SAI ELECTRICAL COMPANY
SHIRIDI SAI ELECTRICAL COMPANY

By

Published : Feb 28, 2023, 9:46 AM IST

ట్రాన్స్​ఫార్మర్ల కొనుగోలు.. అక్కడ తక్కువ.. ఇక్కడ ఎక్కువ ఎందుకు..

SHIRIDI SAI ELECTRICAL COMPANY : వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కావొచ్చు,. పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కావొచ్చు.. కాంట్రాక్ట్‌ ఏదైనా షిర్డీసాయి ఎలక్ట్రికల్సే కొల్లగొడుతోంది. టెండర్‌ నిబంధనలనూ ఆ సంస్థే నిర్ణయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. డిస్కంలకు అవసరమైన విద్యుత్‌ ఉపకరణాలు షిర్డీసాయి సంస్థ నుంచే కొనాలి,. వాళ్లు కాదన్నప్పుడే ఇతర సంస్థలకు అవకాశం ఇవ్వాలనేంతగా పరిస్థితి మారింది. రెండు డిస్కంల పరిధిలో.. సుమారు 16 లక్షల స్మార్ట్‌ మీటర్లను షిర్డీసాయి సంస్థ నుంచి అధిక ధరలకు కొనాలని చూసి,. విమర్శలు ఎదురవడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. వ్యవసాయ కనెక్షన్లకు అవసరమైన 25 కిలో వాట్‌ యాంపియర్‌ ట్రాన్స్‌ఫార్మర్లన్నింటినీ ఏదో ఒక రూపంలో కనీవినీ ఎరుగని ధరలకు ఆ సంస్థ నుంచే కొనుగోలు చేస్తోంది.

షిర్డీ స్థాయి టెండరే ఎక్కువటా..!: వ్యయసాయ కనెక్షన్లకు అవసరమైన 10 వేల ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకి.. 2022లో ఎస్పీడీసీఎల్​ టెండర్లు పిలిచింది. అయితే ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు.. లక్షా 17 వేల 943 రూపాయల చొప్పున కోట్‌ చేసింది షిర్డీసాయి సంస్థ. రవాణా ఖర్చులు 700, జీఎస్‌టీ 21 వేల 355 రూపాయలు కలిపి.. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కి లక్షా 39వేల 999 రూపాయలు చెల్లించేలా.. షిర్డిసాయి సంస్థకు గత ఏడాది జులైలో ఎస్పీడీసీఎల్​ పర్చేజ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. షిర్డిసాయితోపాటు బిడ్‌లు దాఖలు చేసిన.. తోషిబా, ట్రాన్స్‌కాన్, హైపవర్, కన్యకాపరమేశ్వరి, బీఎస్‌ఆర్‌ కంపెనీలు.. షిర్డీసాయి సంస్థ కన్నా తక్కువకు కోట్‌ చేయలేకపోయాని అధికారులు చెప్తున్నారు.

ఐతే.. అవే సంస్థలు డిస్కంలు పంపిణీ నెట్‌వర్క్‌లో వినియోగించే.. 33, 63, 100, 160, 250, 400 KVA ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా టెండర్లు దక్కించుకున్నాయి. కానీ 25 KVA ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్లలో.. పోటీ పడకపోవడం వెనుక పెద్ద మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. కొవిడ్‌ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ల తయారీకి వినియోగించే.. ఉక్కు, అల్యూమినియం ధరలు భారీగా పెరిగాయని, అందుకే షిర్డిసాయి సంస్థ ఆ ధర కోట్‌ చేసిందని.. అధికారులు చెబుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో షిర్డీసాయి కన్నా తక్కువ ధరకే.. 25KVA ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నారు.

హరియాణ, తెలంగాణ కన్నా ఏపీలోనే అధికం: హరియాణలోని.. ఉత్తర హరియాణ బిజిలి వితరణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ.. వ్యవసాయరంగ అవసరాలకు కొనే ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు.. అన్ని ఖర్చులూ కలిపి 70 వేల 967రూపాయల ధర ఖరారు చేసింది. 2023 మార్చి వరకూ,. ఇదే ధరలు వర్తిస్తాయని తెలిపింది. కానీ అదే ప్రమాణాలతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్‌ను షిర్డీసాయి సంస్థ నుంచి ఏపీ డిస్కంలు.. లక్షా 39 వేల 999 రూపాయల చొప్పున కొంటున్నాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు.. 69 వేల నుంచి 74 వేల రూపాయల వరకూ ఎక్కువగా చెల్లించడం అడ్డగోలు దోపిడీ కాదా.. అనే ప్రశ్న వినిపిస్తోంది. పొరుగునున్న.. తెలంగాణ డిస్కంలూ 2022 ఏప్రిల్‌ 4న జారీ చేసిన పర్చేజ్‌ ఆర్డర్‌ ప్రకారం..అన్నీకలిపి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ ధర 75 వేల రూపాయలగాను నిర్ణయించాయి.

పాత వాటినే సరఫరా చేస్తున్నారా..!: డిస్కంలకు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల ట్యాంక్‌పై.. సరఫరా ఒప్పంద తేదీ, తయారీ సంస్థ పేరు, తయారు చేసిన సంవత్సరం, సీరియల్‌ నెంబర్లను.. ఎంబోజింగ్‌ చేయాలన్నది నిబంధన.! కానీ.. ఇప్పటికే షిర్డిసాయి సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లలో ఆ వివరాలన్నీ ఒక ప్లేట్‌పై ప్రత్యేకంగా ముద్రించి, వెల్డింగ్‌తో అతికించి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పాత ట్రాన్స్‌ఫార్మర్లకే రంగులు వేసి సరఫరా చేస్తున్నారా? అని.. విద్యుత్‌రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మార్చి నెల చివరి కల్లా లక్షా 25 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి.. ఇటీవలే ప్రకటించారు. దీంతో షిర్డిసాయి సంస్థ పంట పండినట్టేనని విద్యుత్‌శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details