Govt Failure to Maintain Model Career Centres: మోడల్ కెరీర్ కేంద్రాల నిధులనూ వదలని సర్కారు.. ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు యువత Government Failure to Maintain Model Career Centres:ఉపాధి కల్పన కార్యాలయాలను మోడల్ కెరీర్ కేంద్రాలుగా మార్చి యువతకు మార్గదర్శకంతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునికీకరణకు నిధులు ఇస్తోంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వక పోగా.. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వాడేసుకొని ఆ కేంద్రాల ఆధునికీకరణను పట్టించుకోవడం లేదు. కేవలం కోటి 73 లక్షలు కేటాయించలేక పోవడంతో పలుచోట్ల పనులు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాటు చేసిన అనేక జిల్లాల్లో ఇంతవరకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎక్కడ నిరుద్యోగిత బయటపడుతుందేమోన్న భయంతో ఈ వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కార్యాలయాలతో పాటు శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర వర్సిటీల్లో మోడల్ కెరీర్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఆధునికీకరణకు కేంద్రం 37 లక్షల 50 వేల నుంచి 60 లక్షల వరకు మంజూరు చేసింది. కెరీర్ కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు నైపుణ్యాలు అందించాల్సి ఉన్నా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో జాబ్‌లు పొందుతున్న వారిలోనూ సగం మంది వెంటనే ఉద్యోగాలు మానేస్తున్న పరిస్థితి ఉంది.
మోడల్ కెరీర్ కేంద్రాల్లో నిరుద్యోగుల నమోదు తూతూ మంత్రంగా మారింది. ఇంజినీరింగ్, సాధారణ డిగ్రీలతో ఉత్తీర్ణులవుతున్న వారు ఏటా రెండున్నర లక్షల మంది ఉండగా.. వీరిలో 30 శాతం మంది కూడా పేర్లు నమోదు చేసుకోవడం లేదు. డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి అర్హత కలిగిన వారిని కలిపితే ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల సంఖ్యను తగ్గించి చూపేందుకు గతంలో ఆఫ్‌లైన్‌లో నమోదైన వారి వివరాలను ప్రభుత్వం ఆన్‌లైన్ చేయడం లేదు. మేళాల్లో లభిస్తున్న ఉద్యోగాలకు వేతనాలు నెలకు 7 వేల నుంచి 15 వేలలోపు ఉండటంతో అక్కడ చేరుతున్న వారిలోనూ సగం మంది వెంటనే మానేస్తున్నారు.
Registration of Unemployed in Model Career Centers..
- విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇప్పటి వరకు 13,250 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో జాబ్ మేళాలకు 5,214 మంది హాజరు కాగా.. కేవలం 35 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి.
- ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3 వేల మంది వివరాలు నమోదు చేసుకోగా.. జాబ్‌మేళాల్లో 350 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి.
- ఉమ్మడి అనంతపురంలో ఇప్పటి వరకు 28 వేల 870 మంది నమోదు చేసుకోగా.. కేవలం 1,226 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.
- ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యాలయంలో 51,741 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. జాబ్‌మేళాలకు 4,579 మంది నిరుద్యోగులు హాజరు కాగా.. కేవలం 1,334 మందిని ప్రైవేటు కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి.
- చిత్తూరు జిల్లా కార్యాలయంలో 34,345 మంది నమోదు చేసుకోగా.. ఇక్కడ మేళాలు సక్రమంగా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.
- ఎన్టీఆర్ జిల్లాలో 29,057 మంది నిరుద్యోగులు వివరాలు నమోదు చేసుకోగా.. వీరిలో ఇటీవల నిర్వహించిన జాబ్‌మేళాలో కేవలం 836 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.
- వైఎస్సార్ జిల్లాలో 2020 నుంచి నిర్వహించిన ఉద్యోగ మేళాలకు 9 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా.. కేవలం 3,370 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి.
- ప్రకాశం జిల్లాలో 59 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 28,059 మంది అభ్యర్థులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. గతంలో ఏటా 12 వేల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1,500కు పడిపోయింది.
- విశాఖలో 5 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నా ఉపాధి కల్పన కార్యాలయం లెక్కల ప్రకారం 24వేల మంది మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా నిర్వహిస్తున్న ఉద్యోగమేళాల్లో కేవలం 2,467 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.
Model Career Centers in Rented Buildings..
- విజయనగరంలో ఇంతవరకు మోడల్ కెరీర్ కేంద్రానికి సొంతం భవనం లేదు. కలెక్టరేట్‌లో ట్రెజరీ కార్యాలయాన్ని అప్పటి కలెక్టర్ కేటాయించారు. దీని మరమ్మతులకు ప్రభుత్వం నిధులివ్వలేదు. అద్దె భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
- జిల్లాల పునర్విభజనకు ముందు ఏలూరులో ఉపాధి కల్పన కార్యాలయం ఉండేది. నిబంధనల ప్రకారం జిల్లాకు ఒక కేంద్రం ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో కొత్తగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీంతో ఆ జిల్లాకు సంబంధించిన వారు ఏలూరు కార్యాలయంలోనే పేర్లు నమోదు చేసుకుని జాబ్ మేళాలకు హాజరు కావాల్సి వస్తోంది.
- సత్యసాయి జిల్లాలోనూ మోడల్ కెరీర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడల్ కెరీర్ కార్యాలయానికి సొంత భవనం లేక ప్రభుత్వ క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడినా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. శ్రీకాకుళం జిల్లా కార్యాలయాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం భవనం పెచ్చులూడి అధ్వానంగా మారింది.
- ఉమ్మడి విశాఖకు చెందిన జిల్లా ఉపాధి కార్యాలయం కంచరపాలెంలో ఉంది. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సేవలను విభజించినా కార్యాలయాలను తరలించలేదు.
Govt not Funding to Model Career Centres..ఉమ్మడి కర్నూలు మోడల్ కెరీర్ కేంద్రానికి 41 లక్షల 56 వేలు మంజూరు చేయగా..24 లక్షల 92 వేలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగంలోకి రాలేదు. నంద్యాల జిల్లా మోడల్ కెరీర్ కేంద్రం ఏర్పాటుకు 56 లక్షలు మంజూరు కాగా.. ఇంతవరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. శ్రీకాకుళం కేంద్రానికి 52 లక్షలు మంజూరు కాగా నిధులు విడుదల కాలేదు. ప్రకాశం కెరీర్ కార్యాలయానికి 54 లక్షలు మంజూరు చేసినా నిధులివ్వలేదు. విశాఖ జిల్లా గాజువాకలోని మోడల్ కెరీర్ కేంద్రానికి 60 లక్షలు మంజూరు కాగా.. 30 లక్షలు మాత్రమే సర్కారు విడుదల చేసింది.
Shortage of Employees in Model Career Centers:మోడల్ కెరీర్ కేంద్రాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు కార్యాలయంలో 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం అయిదుగురే పని చేస్తున్నారు. అనంతపురం కేంద్రంలో 10 మంది ఉద్యోగులు అవసరం కాగా.. ఆరుగురు మాత్రమే ఉన్నారు. కర్నూలు కార్యాలయంలో 13 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. 10 మంది పని చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.