పాస్‌పోర్టు సేవా కేంద్రాల మాదిరే.. రిజిస్ట్రేషన్ కేంద్రాలు. Registration Service Centers: త్వరలోనే ఏపీలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీసీఎల్ఏ జి సాయి ప్రసాద్ తెలిపారు. త్వరలోనే దీనికి టెండర్లు కూడా పిలవాలని నిర్ణయించామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలకు సిద్ధంగా ఉన్నా.. పూర్తి స్థాయిలో సేవలు అక్కడికి బదిలీ కాలేదన్నారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల్లోనే అంటే.. ఫ్రంట్ ఎండింగ్ అంతా కూడా మూడో వ్యక్తికి టెండర్లు ఇచ్చి బ్యాక్ ఎండ్ వరకు మాత్రం వారి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్‌ను ఇద్దరిని పెడితే సరిపోతుందన్నారు.
2023 మే 20 నాటికి మొదటి దశ రీ సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. మొత్తంగా 25.8 లక్షల సర్వే రాళ్లు పాతాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాల నుంచి తొలగించామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో మ్యుటేషన్ సేవలు విస్తృతం అయ్యాయని తెలిపారు. 2.47 లక్షల రెవెన్యూ రికార్డులు ఉంటే 1.7 లక్షల రికార్డుల తనిఖీ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దాని గురుంచి సీఎం జగన్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. రికార్డుల్లో మార్పు చేర్పులు, తొలగింపులు చాలా జాగ్రతగా చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ ఏడాదిలో 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థుల కుల ధృవీకరణ వివరాలను సేకరించామని తెలిపారు. విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కుల ధృవీకరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. అంతా ఒకేసారి చేయొచ్చని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయం నుంచి సులువుగా పొందే అవకాశం కల్పించామని అన్నారు. కేవలం ప్రింట్ అవుట్ తీసుకునేలా 40 లక్షల మందికి వెసులుబాటు కలిగిందన్నారు. త్వరలోనే మిగతా వారి కులాల వివరాలు నమోదు చేసి గ్రామ, వార్డు సచివాలయం డేటా బేస్‌తో అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
గ్రామ సచివాలయాల్లోనే కాకుండా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేవి కూడా ఇప్పుడు టెండర్లు పిలిచి ప్రాంరంభిస్తున్నాం. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లోనే అంటే ఫ్రంట్ ఎండింగ్ అంతా కూడా మూడో వ్యక్తికి టెండర్లు ఇచ్చి బ్యాక్ ఎండ్ వరకు మాత్రం వారి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్‌ను ఇద్దరిని పెడితే సరిపోతుంది. అది తొందర్లోనే అవుతుంది. దాని గురించి సీఎంతో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.. ఈ సేవా కేంద్రాల వల్ల వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి డాక్యుమెంట్ తయారు చేసి.. డబ్బులు కూడా అక్కడే కట్టించుకుని.. ఎలక్ట్రానిక్ స్టాంపింగ్ చేసి సబ్ రిజిస్ట్రార్‌కి పంపిస్తారు.- సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ
ఇవీ చదవండి: