Sajjala Ramakrishna Comments ON GO NUMBER 1: జీవో నెంబర్ 1లోని అంశాలతో త్వరలో శాసన సభలో చట్టం తీసుకువస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జీఓ వన్ అమలు చేయడానికి వీలు లేదని కోర్టు చెప్పలేదని, ఇంకొక చట్టం తీసుకురమ్మని చెప్పిందన్నారు. దీని అమలు కోసం కొత్త చట్టం త్వరలో వస్తుందన్నారు. న్యాయ నిపుణులతో, అధికారులతో చర్చించి చట్టం తెస్తామన్నారు. జీవో వన్ అంటే చంద్రబాబు చేసిన తప్పు గుర్తు రావాలన్నారు. పేదలకు స్థలాలను ఇస్తుంటే అడ్డుకోవడం అన్యాయమని, అలాంటి ఆలోచన ఎవరికి రాకూడదన్నారు.
దుర్మార్గమైన ఆలోచన తెలుగుదేశం అండ్ కోకి వచ్చిందన్నారు. పేదల ఇళ్ల స్థలాలపై సుప్రీం కోర్టుకు పోవడం బరితెగింపునకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వానికి వచ్చిన ల్యాండ్ ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. ప్రభుత్వ భూమి అయిన తరువాత అవసరాన్ని బట్టి వాడతామన్నారు. ఎవరిపైనా కక్షతో చేసింది కాదు.. అందరూ ఉండాలని చేశామన్నారు. కోర్టుల్లో కేసుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్లు రైతులు కాదని,.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లని సజ్జల మండిపడ్డారు.
"మీరు చట్టం తెచ్చుకోండి కావాలంటే.. ప్రస్తుతం ఉన్నదాని ప్రకారం అయితే కాదు అని కోర్టు చెప్పింది. అంతే కాని అది చెల్లదు. మీరు అలా చేయడానికి వీల్లేదు అని ఎవరూ అనలేదు. కచ్చితంగా చట్టం అయితే ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది. మరోసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలనేది ఉద్దేశం". - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
జీవో నెంబర్ 1 ఏంటి: రాష్ట్రంలో రోడ్ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. పంచాయతీ, మున్సిపల్ రోడ్లు, రహదారుల మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేస్తామని అన్నారు. అటువంటి ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోంశాఖ పేర్కొంది. కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని తెలిపింది. కొన్ని అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.