ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో ఉన్న నీటి లభ్యతపై అధ్యయనానికి నిర్ణయం

తెలుగు రాష్ట్రాలకు గోదావరిలో ఉన్న నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించిన నదీ యాజమాన్య బోర్డు... ఈ అంశాన్ని కేంద్ర జలసంఘానికి నివేదించనుంది. తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం కనీసం పట్టించుకోవడం లేదని ఏపీ వ్యాఖ్యానించింది. అనుమతుల అంశాన్ని ఏళ్ల తరబడి నాన్చడం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోందని, సమయం వృథా అవుతోందని తెలంగాణ పేర్కొంది.

grmb
grmb

By

Published : Jan 3, 2023, 8:30 PM IST

గోదావరిలో ఉన్న నీటి లభ్యతపై అధ్యయనానికి నిర్ణయం

GRMB meeting in Hyderabad: ఛైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో సమావేశమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు.. వివిధ అంశాలపై చర్చించింది. గోదావరి జలాల్లో తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న నీటిని తేల్చేందుకు అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో అధ్యయనం చేయిస్తే మేలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో ఈ అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని జీఆర్ఎంబీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల అనుమతుల ప్రక్రియలో భాగంగా డీపీఆర్​లపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అనుమతుల ప్రక్రియ ఆలస్యం అవుతుండడం ఇబ్బందికరంగా మారిందని... ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.

మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లపై చర్చించాం. ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తింది. గోదావరిలో నీటి లభ్యత ఉందని జలసంఘం డైరెక్టర్ చెప్పారు. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. పోలవరం అంశాన్ని పీపీఏలో చర్చించాలని సూచించారు. గోదావరిలో మిగుల జలాల కోసం అధ్యయనం. అధ్యయన అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని నిర్ణయంచారు. పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ తీర్పుపై ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించాం. పూర్తిస్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తాం. -రజత్‌కుమార్‌, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత లేనందున తెలంగాణ ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఏపీ అధికారులు ప్రశ్నించారు. వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్న కేంద్ర జలసంఘం అధికారి రాయ్... నీటి లభ్యత ఉందని స్పష్టం చేశారు.

సాంకేతిక సలహా మండలి సమావేశం సమయంలో తమ అభ్యంతరాలను పట్టించుకోలేదు. స్టేక్ హోల్డర్‌గా కనీసం తమను పిలవలేదన్నారు. కడెం ప్రాజెక్టుకు ఇప్పటికే నీటి లభ్యత ఉండగా మళ్లీ గూడెం ఎత్తిపోతల ఎందుకని ప్రశ్నించారు. -ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి.

రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు ఆధునికీకరణ పనులపైనా బోర్డు చర్చించింది. ఆధునికీకరణ పనులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అత్యవసర పనులను వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి ప్రవాహాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు అమర్చే విషయమై చర్చించారు. దశలవారీగా 23 స్టేషన్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సరిహద్దు పాయింట్ల వద్ద ప్రస్తుతానికి ఐదు చోట్ల టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పోలవరం బ్యాక్ వాటర్‌తో పాటు దాని ఆధారంగా ఏపీ ప్రతిపాదిస్తున్న కొత్త ఎత్తిపోతల ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో ముంపు వస్తుందని.... తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చించాలని గోదావరి బోర్డు ఛైర్మన్ సూచించారు. బోర్డు నిర్వహణ, సీడ్ మనీ, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details