పంచాయతీ ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేయాలని... పార్టీ నాయకులకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిర్దేశకులని... వాళ్ల అభీష్టం మేరకే పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. తన నివాసంలో నేతలతో భేటీ అయిన చంద్రబాబు... స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. ఈ నెల 18నుంచి తెదేపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా... 4రోజుల్లో జరిగిన పురోగతిపై చంద్రబాబు ఆరాతీశారు.
గ్రామ, మండల పార్టీ కమిటీల ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని నేతలకు సూచించారు. క్షేత్రస్థాయి నుంచి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పటిష్ఠ నాయకత్వం రూపొందాలన్నారు. మండల స్థాయిలో 14 అనుబంధ సంఘాలకు కమిటీలు, గ్రామస్థాయిలో తెలుగు రైతు, తెలుగు మహిళ, తెలుగు యువత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 16వేల గ్రామ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.
900 పైగా మండల, పట్టణ కమిటీలకు డిసెంబర్ 25కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర పార్టీ నుంచి త్రిసభ్య బృందాలు హాజరవుతాయని చెప్పారు. జిల్లా పర్యటనల్లో కార్యకర్తల్లో ఉత్సాహం బాగుందన్న అధినేత... క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిలో పట్టుదల పెరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధిని రివర్స్ చేసి... సంక్షేమాన్ని రద్దు చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.