ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియామకం - APPSC New Chairman

APPSC Chairman Gautam Sawang: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. కొద్ది రోజుల క్రితమే సవాంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది.

Gautam Sawang
Gautam Sawang

By

Published : Feb 19, 2022, 10:21 AM IST

APPSC Chairman Gautam Sawang: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్‌ సవాంగ్‌ను నియమిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.

మరోవైపు ఆరో బెటాలియన్‌ గ్రౌండ్‌లో గౌతమ్‌ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. కుటుంబ సమేతంగా గౌతమ్‌ సవాంగ్‌ వీడ్కోల కార్యక్రమానికి హాజరయ్యారు.

అనూహ్యంగా బదిలీ..

Ap Dgp Gautam Sawang Transfer: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత నిఘావిభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని నియమించింది. ఇటీవలే అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన ఆయనకు పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్‌)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

గౌతమ్‌ సవాంగ్‌ ఆకస్మిక బదిలీ వెనుక ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే కారణమని తెలుస్తోంది.ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రయోజనాలను నిరసిస్తూ ఈ నెల 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలమంది తరలివచ్చారు. వారంతా బీఆర్టీఎస్‌ రోడ్డులో భారీగా నిరసన ప్రదర్శన చేయటంతో ప్రభుత్వానికి పెద్ద షాక్‌ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వేలమంది రావడం ఇటీవల ఇదే తొలిసారి. అంతమంది వస్తారనే విషయాన్ని డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ అంచనా వేయలేకపోయారని, విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని నిలువరించలేకపోయారని.. ఆ వైఫల్యాల వల్లే చలో విజయవాడ విజయవంతమైందన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఆయన్ను డీజీపీ పోస్టు నుంచి తప్పించినట్లు సమాచారం. ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశామని, నోటీసులిచ్చి అడ్డుకున్నామని, ఏ జిల్లా నుంచీ వందమందికి మించి విజయవాడకు రారంటూ పోలీసుశాఖ తొలుత నివేదించిందని... అదే నిజమైతే అన్ని వేలమంది ఎలా వచ్చారన్న కోణంలో ఆరాతీసిన ప్రభుత్వం... ఆ వైఫల్యానికి బాధ్యుడిగా సవాంగ్‌ను బదిలీ చేసినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చలో విజయవాడ విజయవంతమైన మర్నాడే సవాంగ్‌ ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చారు.

మరో ఏడాదికి పైగా సర్వీసు ఉన్నా...

సాధారణంగా డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేసి, పోస్టింగు ఇవ్వకపోతే వారిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీయే ఆదేశాలిస్తారు. ఇప్పటివరకూ ఆ హోదాలో కొనసాగిన అధికారే చివరికి పోస్టింగు లేక.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి రావటం ఐపీఎస్‌లలో చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్‌ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మంగళవారం వరకూ ఆ పోస్టులో కొనసాగారు. రెండేళ్ల 8 నెలల 15 రోజుల పాటు ఆయన డీజీపీ పదవి నిర్వహించారు. 2023 జులై నెలాఖరు వరకూ ఆయనకు సర్వీసు ఉంది. అలాంటిది ఉన్నపళంగా ఆయన్ను బదిలీ చేయటం, పోస్టింగు ఇవ్వకపోవటం చర్చనీయాంశమైంది.

ఆరోపణల నుంచి ఉద్వాసన దాకా..

డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ వ్యవహార శైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఆయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విధానాల్ని, లోపాల్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు చెప్పారంటూ వారికి అనుకూలంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులపై గౌతమ్‌ సవాంగ్‌ హయాంలో తీవ్ర అణచివేత కొనసాగింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలకు కొవిడ్‌ నిబంధనల పేరిట పోలీసులు అనుమతి ఇచ్చేవారు కాదు. అధికార పార్టీ నాయకులు వేలమందితో కార్యక్రమాలు చేసినా పట్టించుకునేవారే కాదు. ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు నాయకులు తమపై జరుగుతున్న దాడుల గురించి విన్నవిద్దామని డీజీపీని కలిసేందుకు వెళ్లినా సవాంగ్‌ వారిని కలిసేవారు కాదు. ప్రతిపక్ష నాయకులు లేఖలు రాసినా స్పందించేవారు కాదు. వైకాపా అధికారం చేపట్టిన కొన్నాళ్లకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. ఆ ఘటనపై గౌతమ్‌ సవాంగ్‌ స్పందిస్తూ.. అది భావప్రకటన స్వేఛ్చ అని వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని ఉండాలని పోరాడుతున్న రైతులపై సవాంగ్‌ హయాంలో తీవ్ర అణచివేత, లాఠీఛార్జీలు సాగాయి. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. రైతులకు సంకెళ్లు వేసి మరీ తరలించారు. వారు చేపట్టిన మహా పాదయాత్రకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తే.. ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకుని నోటీసులిచ్చారు. ఈ వ్యవహారంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ప్రభుత్వం వద్ద మెప్పు పొందడానికే ఆయన ఈ స్థాయిలో నిబంధనల్ని పక్కన పెట్టినా.. అదే ప్రభుత్వ పెద్దలు ఆయన్ను వాడుకుని వదిలేసినట్లు పక్కన పెట్టేశారని ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై నిత్యం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే ఓ ప్రజాప్రతినిధి కొన్నాళ్ల కిందట ఓ కేసులో అరెస్టయ్యారు. ఆయనతో డీజీపీ టచ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. అప్పటి నుంచే సవాంగ్‌ను నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. తర్వాత పలు సందర్భాల్లో ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పొమ్మనకుండా పొగ పెట్టి ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేశారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదీ చదవండి:

Gautam Sawang Transfer: గౌతమ్ సవాంగ్‌ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details