APPSC Chairman Gautam Sawang: కోర్టు ధిక్కరణ కేసులో పూర్వ డీజీపీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, హోంశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు వ్యాజ్యంపై విచారణ జరిపారు. ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పదోన్నతి కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించలేదని ఆక్షేపించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సానుకూల దృక్పథంతో అర్ధం చేసుకోలేదన్నారు. అధికారుల తరఫు న్యాయవాది కిశోర్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏసీఆర్(వార్షిక రహస్య నివేదిక)ను పరిగణనలోకి తీసుకొని పదోన్నతి కల్పించలేదన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేశామన్నారు. దానిపై తిరుగు సమాధానం(రిప్లై) వేయాలని పిటిషనర్‌కు సూచించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేశారు. అధికారులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.
విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ రాజశేఖర్‌కు 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబర్ 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంలో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం విచారణకు పూర్వ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హాజరు అయ్యారు. ఇదే కేసులో గత విచారణకు డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హాజరు అయిన విషయం తెలిసిందే.