పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన ప్రాంతంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు 24 గంటలకు పైగా సమయం పడుతుందని... నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గేటు విరిగిపోయవడానికి గల కారణాల పై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం జలాశయంలో నీటిని ఖాళీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు నిర్మాణాల్లో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
పులిచింతల ప్రాజెక్టులో గేటు ఊడిన ప్రాంతాన్ని మంత్రి అనిల్‌కుమార్ పరిశీలించారు. గేటు ఊడిపోయిన విషయంపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చలు జరిపారు. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నంబరు గేటు ఊడిపోయింది.
పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబర్ గేటు వరద ప్రవాహంతో కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్‌లో సాంకేతిక సమస్య వల్ల 16 నంబర్ గేటు ఊడిపోయింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోతోంది. లోతట్టు ప్రాంతాలైన మాదిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిందని ఆయన తెలిపారు. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారని, ఇందుకు డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని లేకపోతే నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉందన్నారు.