గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి బాలు నాయక్ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 800 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలకలూరిపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. పట్టణంలోని సుగాలీ కాలనీకి చెందిన బాలు నాయక్ కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో అక్కడ స్నేహితులు, వివిధ కారణలతో అడ్డదారులు తొక్కాడు. గంజాయికి అలవాటు పడ్డాడు.
కాకినాడ నుండి చిలకలూరిపేట...
గంజాయి తీసుకుంటున్న బాలు.. లాక్డౌన్ కాలంలో చిలకలూరిపేటకు దాన్ని తీసుకొచ్చి విక్రయించటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న పత్తి, నూలు మిల్లుల్లో కాకినాడ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడనే సమాచారంతో బాలుపై పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగా ఇవాళ అతని వద్ద నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఆయన వివరించారు.