ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంబంధం లేదంటే అమరావతి రైతుల త్యాగాలను అవమానించినట్లే' - అమరావతిపై గల్లా జయదేవ్ వ్యాఖ్యల వార్తలు

అమరావతి విషయంలో కేంద్రం తమకు సంబంధం లేదంటే రైతుల త్యాగాలను అవమానించినట్లేనని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ను విడగొట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ కేంద్రం పాత్ర ప్రతి అంశంలో ఉందని ఆయన అన్నారు. భారత చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్రమే నోటిఫై చేసిందని... ఇప్పుడు తమకు ఎలాంటి సంబంధం లేదంటే ఎలాగని ప్రశ్నించారు.

galla jayadev about amaravathi
గల్లా జయదేవ్

By

Published : Aug 7, 2020, 8:38 PM IST

రాజధాని ఎక్కడనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని.. ఈ విషయంలో తమ పాత్ర లేదని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ను విడగొట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ కేంద్రం పాత్ర ప్రతి అంశంలో ఉందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రమే అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల ఆధారంగానే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించింది

చట్టసభల్లో తీర్మానం ద్వారా రాజ్యాంగబద్ధంగా అమరావతి రాజధానిగా పురుడు పోసుకుందన్నారు. కేంద్ర పర్యవరణ, అటవీశాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందిందని గుర్తు చేశారు. సాక్ష్యాత్తూ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందన్నారు. భారత చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్రమే నోటిఫై చేసిందని... ఇప్పుడు తమకు ఎలాంటి సంబంధం లేదంటే ఎలాగని ప్రశ్నించారు. దిల్లీకి మించిన రాజధాని కట్టుకోవాలని.. కేంద్రం ఆర్థికంగా అండగా ఉంటుందని మోదీ చెప్పిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అందుకే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​పై కేంద్రం పునరాలోచించాలని కోరారు.

కేంద్ర నిర్ణయం సరికాదు

రాజధాని అభివృద్ధికి కేంద్రం అందించిన డబ్బు వృథా అవుతుంటే చోద్యం చూస్తారా అని గల్లా ప్రశ్నించారు. అఫిడవిట్ దాఖలు చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటే... రాష్ట్ర ప్రజలతోపాటు రాజధాని రైతుల త్యాగాలను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా భవిష్యత్తులో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజధాని రైతుల అమరావతి కలను సజీవంగా ఉంచడంలో పూర్తి మద్దతిస్తానని గల్లా తెలిపారు. మొండిగా రాజధానిని మార్చడానికి ప్రయత్నిస్తున్న వైకాపా ప్రభుత్వానికి నిత్యం నాయస్థానాల్లో మొట్టికాయలు పడుతున్న విషయం కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

'రాష్ట్రాభివృద్ధికి ఇంధనం అమరావతి... కాపాడుకోవడం అందరి కర్తవ్యం'

ABOUT THE AUTHOR

...view details