ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడుకు నిధుల కొరత.. పాఠశాలల్లో నిలిచిన పనులు.. అవస్థలు పడుతున్న విద్యార్థులు - ఏపీలో నాడు నేడు పథకం

NO FUNDS TO NADU NEDU : రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొంటున్న ‘నాడు-నేడు’ పథకం.. నిధుల కొరతను ఎదుర్కొంటోంది. రెండో దశ పనులకు సంబంధించి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిమెంటు కంపెనీలకూ 50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దీని వల్ల.. సగం పూర్తయిన పనులతో వందల కొద్దీ బడుల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల గదులు పూర్తికాక.. పాఠశాలల్లో తరగతుల విలీనాన్ని కూడా విద్యా శాఖ వాయిదా వేసుకుంది.

NO FUNDS TO NADU NEDU
NO FUNDS TO NADU NEDU

By

Published : Feb 16, 2023, 8:44 AM IST

నాడు-నేడుకు నిధుల కొరత.. పాఠశాలల్లో నిలిచిన పనులు.. అవస్థలు పడుతున్న విద్యార్థలు

NO FUNDS TO NADU NEDU : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘనంగా చేపట్టిన నాడు నేడు పథకం రెండో దశ పనులకు.. 2021 ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్​ శ్రీకారం చుట్టారు. మొత్తం 22 వేల 344 పాఠశాలలు, వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలల్లో వీటికి సంబంధించిన పనులు చేపట్టారు. వీటికి అదనంగా నాబార్డు నుంచి 2 వేల 538 కోట్ల రూపాయలు తీసుకొచ్చి.. 3 వేల 199 పాఠశాలల్లో పనులు చేస్తామన్నారు. పనులను 2022 జులై నాటికి పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు.

అయితే పరిపాలన అనుమతులు ఇచ్చేందుకే దాదాపు సంవత్సరం సమయం పట్టింది. ఆ తర్వాత గడువును పెంచి.. ఈ నెల చివరికి పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. పాఠశాలల వద్ద సైతం నిధుల్లేక.. కొన్ని చోట్ల స్వల్పంగా సిమెంటు, ఇసుక నిల్వలు ఉన్నా పనులు జరగడం లేదు. వైఎస్సార్​ జిల్లాలోని ఓ పాఠశాలలో గత అక్టోబర్ నుంచి నిధుల్లేక పనులు నిలిచిపోయాయి. ఇక్కడ మిగిలి ఉన్న సిమెంట్‌ పనికి రాకుండా పోయే పరిస్థితి నెలకొంది.

నిధుల విడుదలలో తీవ్ర జాప్యంతో పాఠశాలల్లో నాడు-నేడు పనులు అనుకున్న మేర జరగడం లేదు. నిధులు ఖర్చు చేయని మొత్తాలను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 266.24 కోట్ల రూపాయలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికే జరిగిన పనుల్లోనూ నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. పాత శ్లాబులకు చేసిన ప్లాస్టరింగ్‌ పెచ్చులుగా ఊడి పడుతోంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో.. ఈ నెల 7న భవనం శ్లాబు పెచ్చులు ఊడటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.

2022 సెప్టెంబర్ 7న తిరుపతి బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో తరగతి గది పైకప్పు పెచ్చులూడి ఒకరికి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. నాడు-నేడు పథకం మొదటి విడతలో 15 వేల 713 పాఠశాలలకు రంగులు వేశారు. వీటిలో 15 శాతం బడుల్లో అవి పోయాయి. మరి కొన్ని చోట్ల గోడలపై మచ్చలు పడుతున్నాయి. పాత రంగులను పూర్తిగా తొలగించకపోవడం, వేసినవీ నాణ్యత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తనిఖీల్లో వెల్లడైంది. పెయింటింగ్‌కు గ్యారంటీ ఉండటంతో.. ఆయా కంపెనీలతో ఈనెలలోపు మళ్లీ రంగులు వేయించాలని అధికారులు నిర్ణయించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వెంకటరెడ్డిపాలెంలోని ఎంపీపీయూపీ పాఠశాలను నాడు-నేడు రెండో దశకు ఎంపిక చేశారు. భవన నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు 27 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులొస్తాయనే నమ్మకంతో పాఠశాల భవనాన్ని కూల్చివేశారు. కానీ అధికారులు మొదటి విడతగా రూ.4లక్షలే ఇచ్చారు. గదుల నిర్మాణానికి నిధులు రాకపోవడంతో 50 మంది విద్యార్థులను 4 నెలలుగా ప్రత్యేక అవసరాల పిల్లల భవిత పాఠశాల వరండాలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. నిధుల్లేక మరుగుదొడ్ల నిర్మాణమూ ఆగిపోవడంతో... హైవే టోల్‌గేట్‌ సంస్థ ఇచ్చిన మొబైల్‌ మరుగుదొడ్లను వాడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details