ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 4:14 PM IST

ETV Bharat / state

'ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి తీరుతాం'

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దీని అమలు కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులు చేయడం ద్వారా పేదరికాన్ని పోగొట్టడానికే ఆంగ్ల మాధ్యమం సహా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

cm jagan
cm jagan

మేధోమధన సదస్సులో సీఎం జగన్

పేదల బతుకుల్లో వెలుగులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టం తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఏడాది పాలన పూర్తవుతోన్న సందర్భంగా విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేధోమధన సదస్సు నిర్వహించారు. పేద పిల్లల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకువస్తే దానిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర పన్నారని సీఎం అన్నారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తే తెలుగును అవమానించినట్లా అని ప్రశ్నించారు.

ఇటీవల 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోగా... 96 శాతం మంది ఆంగ్ల మాధ్యమానికే మద్దతు తెలిపారని సీఎం జగన్ వెల్లడించారు. వీటన్నింటినీ ఎస్​సీఈఆర్టీకి పంపగా... ప్రతి మండల కేంద్రంలో ఒ‍క తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేసి మిగిలినవి ఆంగ్లమాధ్యమం అమలుకు సిఫార్సు చేసిందన్నారు. ఈ ఏడాది 1-6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిగా ప్రవేశపెడతామన్న సీఎం జగన్.. దీని కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో 47,656పైగా పాఠశాలు, కళాశాలల్లో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాల కల్పించడమే లక్ష్యంగా 3600 కోట్ల రూపాయలతో నాడునేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలివిడతలో 15,715 పాఠశాలల్లో జూలై నాటికి రూపురేఖలు మార్చుతామని స్పష్టం చేశారు.

పాఠశాల విద్య ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వెబ్​సైట్​ను సీఎం ఆవిష్కరించారు. విద్యా సంస్థల్లో ఉన్న సదుపాయాల వివరాలను ప్రతి పాఠశాల.... ఈ వెబ్​సైట్​లో పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వీటిపై విద్యార్థులు స్వయం పరిశీలన చేయవచ్చన్నారు. వీటి వల్ల సరైన సదుపాయాలు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రతిపేద ఇంట్లో చదువులు దీపాలు వెలగాలని.. వారి భవిష్యత్ మారాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే ఏడాదిలో ఇంతకు ముందు కంటే మెరుగ్గా పరిపాలన చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

'ఆంగ్ల మాధ్యమం పెట్టండి.. తెలుగు మాధ్యమం ఉంచండి'

ABOUT THE AUTHOR

...view details