Former MLAGadikota Dwarkanath Reddy joined TDP:తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ద్వారకానాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి, ఆయన భార్య మినహా మిగిలిన కుటుంబసభ్యులంతా తెలుగుదేశంలో చేరేందుకు వచ్చామని ద్వారాకానాథ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి దంపతులు కూడా వైఎస్సార్సీపీ వీడే పరిస్థితి రావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. విజయసాయి రెడ్డిని తెలుగుదేశంలోకి రమ్మని ఆహ్వానించే హక్కు తనకుందని ద్వారాకానాథ రెడ్డి తెలిపారు.
ఇదేం సామాజిక న్యాయం- అన్నిటా జగన్ సొంత నేతల ఆధిపత్యమే! పార్టీలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు
సీఎంవోలో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు: వైఎస్సార్సీపీలో తనకు పలుమార్లు టిక్కెట్ ఇస్తానని మాట తప్పారని వాపోయారు. రాయచోటి టిక్కెట్ ఇవ్వకపోయినా, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి కూడా మోసగించారని మండిపడ్డారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ద్వారాకానాథ రెడ్డి ఆరోపించారు. జగన్ పాలన మొత్తం అవినీతిమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు జగన్ పాలనకు పొంతనే లేదని ద్వారాకానాథ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం వాడుకుని వదిలేయడం జగన్ నైజమని ధ్వజమెత్తారు. సీఎంవోలో తన బావ విజయసాయిరెడ్డితో కలిపి మరో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు. విజయసాయి, సజ్జల, మిథున్ రెడ్డి లాంటి కలక్షన్ ఏజెంట్లకే జగన్ వద్దకు అనుమతి ఉంటుందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి 40వేలు తక్కువ కాకుండా మెజారిటీ వచ్చే రాయచోటిలో ఈసారి ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని హెచ్చరించారు. కడపలోనే ఈసారి తెలుగుదేశం పార్టీకి 6 నుంచి 7సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ద్వారకానాథ రెడ్డి మేనమామ అవుతారు.