తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత - తెదేపా నేత పుష్పరాజ్ కన్నుమూత
17:26 July 28
చంద్రబాబు సంతాపం
TDP PUSHPARAJ: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కొవిడ్ బారిన పడిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు పుష్పరాజ్‌ను ఇటీవలే గుంటూరులోని.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే ఉన్న పుష్పరాజ్.. 1983, 1985లో తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1994లో వామపక్షాలతో పొత్తు కారణంగా టికెట్ రాలేదు. మళ్లీ 1999లో తెదేపా తరఫున తాడికొండ నుంచే పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. 2004లో టికెట్ వచ్చినా ఓటమి పాలయ్యారు. 2017లో ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. పుష్పరాజ్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
చంద్రబాబు సంతాపం: తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పుష్పరాజ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధతతో, నిజాయితీతో పుష్పరాజ్ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు. అధ్యాపక వృత్తిని వదిలి ఎన్‌టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్ నాంది పలికారని తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా ప్రజలకు విశేషమైన సేవలందించారన్నారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: