Devineni Uma Comments On Jagan : అప్పుల కోసం ఖర్చు తగ్గించే నిబంధనతో ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులను వైఎస్సాసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకే దిక్కులేదని ఆయన పేర్కొన్నారు. బడుల్లో టీచర్లు లేకుండా రంగులు వేస్తేనో బడి గోడలపై బొమ్మలు వేస్తేనో పిల్లలకు చదువు వస్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీలుగా కనిపించిన 23 వేల పోస్టులు అధికారంలోకి రాగానే మాయమయ్యాయని ఆక్షేపించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. మెగా డీఎస్సీ వేస్తాను అంటూ నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆయన అన్నారు.
సీఎం అవినీతిని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దోపిడీ విధానం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కొనసాగిస్తున్నాడని గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నూరు మున్సిపాలిటీ కమిషనర్‌తో సహా పలువురు ఇంజనీరింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
14, 15 ఆర్థిక సంఘం నిధులు గుత్తేదారులకు దోచిపెడుతున్నారని, దీని కోసం 2020 సంవత్సరంలో అనుమతి పొందిన పనులను వ్యయాలు పెంచి 2023లో పనులు నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాల కంటే ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాల కోసం నిధులు దోచేస్తున్నారని ప్రతి సచివాలయం నిర్మాణంలో ప్రభుత్వం 20 లక్షల నగదు మంజూరు చేసిందని, నియోజకవర్గంలో పక్కా భవనాల స్థానంలో రేకుల షెడ్లు నిర్మించి కూడా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.