Former Election Commissioner Nimmagadda Ramesh: రాష్ట్రంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఐప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థల సహాయంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దుర్బుద్ధితో ఫామ్7 దరఖాస్తు చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని నిమ్మగడ్డ హెచ్చరించారు.
ఓటర్లను ప్రభావితం చేస్తున్న సంస్థ: సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం గతంలో జరిగిందని నిమ్మగడ్డ ఆరోపణలు చేశారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ.. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసిందని అన్నారు. బ్రెగ్జిట్ సమయంలోనూ కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రభావితం చేసిందని.. తర్వాత కాలంలో కేంబ్రిడ్జ్ అనలిటికాను నిషేధించారని వివరించారు.
ఎట్టకేలకు రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కు స్వగ్రామంలో ఓటు
"ఐప్యాక్, రామ్ ఇన్పో వంటి సంస్థలకు నేరుగా కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని అప్పగించారు. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ కోసం ఇచ్చినట్లు జీవోలు ఉన్నాయి. కానీ, ఈ సంస్థలు ఏం ట్రైనింగ్ ఇచ్చారు. వీటివల్ల గణనీయంగా ఎటువంటి మార్పులు వచ్చాయనే దానిపై ఎటువంటి సమాచారం లేదు." - నిమ్మగడ్డ రమేశ్, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్
కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని అందులో.. ఐ ప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. రామ్ ఇన్‌ఫో గతంలో వాణిజ్యపన్నుల సేవలందించిందని అన్నారు. రామ్ ఇన్ఫో సంస్థ యాజమాన్యం చేతులు మారిందని.. యాజమాన్యం మారిన తర్వాత రామ్ ఇన్‌ఫోపై ఆరోపణలు వస్తున్నాయని వివరించారు.
CFD Meets SEO: ఓటర్ల జాబితాలో వారి జోక్యాన్ని తప్పించాలి.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ'
ఓటర్లను ప్రభావితం చేసేవారిని లొంగదీసుకుంటున్నారు: ఐ ప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎఫ్‌డీ కోరుతోందని అన్నారు. సామాజికంగా ప్రభావితం చేయగలవారిని ఐప్యాక్, రామ్ ఇన్ఫో సంస్థలు గుర్తిస్తున్నాయన్నారు. ప్రభావితం చేసేవాళ్లను వివిధ మార్గాలతో ఈ సంస్థలు లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఎఫ్‌ఐఆర్‌లు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ఎఫ్‌ఐఆర్‌లను బెదిరింపు అస్త్రంగా వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయని వివరించారు.
విపక్ష నేతలను కేసులతో బెదిరిస్తున్నారు: విశ్రాంత అధికారులతో ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై పరిశీలన చేయించాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై ఓ కమిటీ వేయాలని.. విచారణలో తేలిన వాస్తవాలను హెచ్చార్సీ ముందు ఉంచుతామని వివరించారు. బూత్ స్థాయి విపక్ష నేతలను కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు బనాయించే హక్కు పోలీసులకు లేదని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించడం ప్రజల హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది: ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలి: రాష్ట్ర పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తారని నమ్ముతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ కేసుల నమోదు మా దృష్టికి వస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓటేయాలని సీఎఫ్‌డీ కోరుతోందని అన్నారు. విపక్షాలపై ఎక్కువ కేసులు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని.. విశ్రాంత జడ్జిలతో కమిటీ వేసి అక్రమ కేసులపై అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు.
దుర్బుద్ధితో ఫామ్ 7 దరఖాస్తు చేస్తే శిక్షార్హులవుతారు: ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి తనకే మూడేళ్ల సమయం పట్టిందని.. స్థానికంగా నివాసం ఉండటం లేదనే కారణంతో ఓటు నమోదు కష్టం అవుతోందని అన్నారు. పాత ఓటును సరెండర్ చేసి కొత్త ఓటు సులభంగా పొందవచ్చునని వివరించారు. ఎన్నారైలు కూడా ఆధార్ కార్డు తీసుకుంటే ఓటు పొందవచ్చునని తెలిపారు. ఫామ్ - 7 ద్వారా గరిష్టంగా ఐదుగురిపై ఫిర్యాదు చేయవచ్చునని.. తప్పుడు సమాచారంతో దుర్బుద్ధితో ఫామ్ 7 దరఖాస్తు చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని తెలిపారు.
HC on Nimmagadda: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్వేచ్ఛ.. ఓటరుగా పేరు నమోదుకు హైకోర్టు ఓకే