FORMER CS LV SUBRAMANYAM LETTER : ఎమ్మెల్సీ ఎన్నికల తీరును తప్పుబడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు. ఐదు, పదో తరగతి పరీక్షలు చదివిన వారిని పట్టభద్రులుగా నమోదు చేయడాన్ని ఎల్వీ లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహణ ప్రవాసనంగా మారిందన్నారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు మీడియాలో కనిపిస్తున్నా ఎన్నికల యంత్రాంగం మౌనంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. రీపోలింద్ ఎందుకు నిర్వహించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలను తక్షణమే పరిశీలించి చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారిని కోరారు.
ఎన్నికలను నవ్వులపాలు కాకుండా చూడాలి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంపై సొంత పార్టీ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే మనసుకు కష్టంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలపై కనిపిస్తున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శించారు. వ్యవస్థలు నిర్వీర్యమయిపోతున్నాయని ఆవేదన చెందారు.
భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నామన్న విషయాన్ని తలచుకుంటే ఆవేదనగా ఉందని చెప్పారు. ప్రజలకు అవససమైనప్పుడు గుర్తుకు వచ్చేవి రెండే.. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండు ఎన్నికల వ్యవస్థ.. అవే ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు దిగజారుతున్నాయి. పోలీసు, ఎన్నికల అధికారులకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలను నవ్వుల పాలు కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆనం కోరారు.