అసెంబ్లీలో ప్రతిపక్షనేతల మైకులు కట్ చేసి...మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెదేపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. సభలో మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకుండా మైకులు ఆపేస్తున్నారని అన్నారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా.. ఇప్పుడు మాట మార్చిందన్నారు. ఆ అంశంపై చర్చించమంటే...తమపై ఎప్పుడో జరిగిన కృష్ణా, గోదావరి పుష్కరాలపై చర్చ చేపట్టి తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు. సభను ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా నడపాలన్నారు. మాజీ ముఖ్యమంత్రిపై చర్చ జరిగినపుడు చెప్పుకునే సమయం ఇవ్వాలన్న సభా గౌరవాన్ని పాటించలేదన్నారు. సమాధానం చెప్పేందుకు సమయం ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు చంద్రబాబు.
మాట మార్చారు..మడం తిప్పారు
రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.9 వేలు ఇస్తామని తెదేపా హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పామన్నారు. ప్రతి ఒక్క రైతుకు రూ.12,500 ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో పెట్టి..ఇప్పుడు రాష్ట్రం రూ.6,500, కేంద్రం రూ.6 వేలు కలిపి రూ.12,500 ఇస్తామని మాట మార్చారన్నారు.