ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న బలవంతపు ఆట- ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలని హుకుం - Allegations on Adudam andhra contests

Forced to Participate in Adudam Andhra Contests: జగన్ ఆడమని చెబితే ఆడాల్సిందే మాకు ఆడటం తెలియదు మహాప్రభో వదిలేయండని మొత్తుకున్నా ప్రభుత్వం వినదు! వచ్చినా రాకపోయినా ఆసక్తి, ఉత్సాహం ఉన్నా లేక పోయినా శరీరం సహకరించినా, సహకరించకపోయినా జగన్ హుకుం జారీ చేశారు కాబట్టి ఆడి తీరాల్సిందే. ఆడటం మీ వల్ల కానే కాదనుకుంటే పోటీలు చూడటానికైనా వెళ్లాల్సిందే. ప్రభుత్వం తలపెట్టిన 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమం జగన్‌కు చెలగాటం, ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.

adudam_andhra
adudam_andhra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 10:45 AM IST

జగనన్న బలవంతపు ఆట- ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలని హుకుం

Forced to Participate in Adudam Andhra contests:యుద్ధాలు వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో ఇంటికొకరిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటారని విన్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అలాంటి తీరును చూస్తున్నాం. కాలం కానీ కాలంలో వంద కోట్లు ఖర్చుతో జగన్ సర్కార్‌ తలపెట్టిన ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనేలా ప్రభుత్వం బలవంతం చేసోంది. గత నెల 27 నుంచి ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించినా స్పందన అరకొరగానే ఉండటంతో అధికారులు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు.

'ఆడుదాం ఆంధ్రా' క్రీడల్లో రాణించిన వారికి నగదు బహుమతులు

సచివాలయ సిబ్బందిపై తిట్ల వర్షం:లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లనూ రంగంలోకి దించారు. సగటున ఒక్కో సచివాలయం పరిధిలో 250 మంది ఆటగాళ్ల పేర్లు నమోదు చేయడం లక్ష్యంగా పెట్టింది. దీన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు రోజువారీ పర్య వేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సభలకు జనాన్ని తరలించాల్సిందిగా ఎంత ఒత్తిడి తెస్తారో దానికి అనేక రెట్లు ఎక్కువగా ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలంటూ చేస్తున్నారు.

ఆటగాళ్లను వెతికి పట్టుకుని, పేర్లు నమోదు చేయడం క్షేత్రస్థాయి ఉద్యోగులకు సంకటంగా మారింది. లక్ష్యాల్ని చేరుకోని సచివాలయ సిబ్బందిని కొందరు ఉన్నతాధికారులు పరుషపదజాలంతో దూషిస్తున్నారు. కొందరైతే సస్పెన్షన్లు వంటి చర్యలకూ తెగబడుతున్నారు. "పిచ్చి పిచ్చిగా ఉందా, ఒళ్లు బద్దకమా? చెబితే అర్ధం కాదా యూజ్ లెస్​ఫెలోస్, పావలా అర్ధరూపాయికీ పనికిరారు" అని కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రాకు పేర్లు నమోదు చేయించలేదంటూ ఇద్దరు కార్యదర్శుల్ని సోమవారం సస్పెండ్ చేశారు.

Jagan Review on Sports: 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు: సీఎం

ఈ వయసులో మేమేం ఆటలు ఆడుతాం:లక్ష్యాన్ని చేరుకోలేదంటూ బాపట్ల జిల్లాలో 29 మంది పంచాయతీ కార్యదర్శులకు అధికారులు ఇటీవల షోకాజ్ నోటీసులిచ్చారు. ప్రజల ఆసక్తి, అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆటలు ఆడాల్సిందేనని ఒత్తిడి తేవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం సాగించిన విధ్వంసంతో రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక గ్రామాల నుంచి యువతరం ఉపాధి వెతుక్కుంటూ వలసపోయింది. చాలా గ్రామాల్లో ఇప్పుడు 40-50 ఏళ్లు దాటినవారు, వృద్ధులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘ఈ వయసులో మేమేం ఆటలు ఆడుతాం?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి పేర్ల నమోదుకు వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు, ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను కూడా రంగంలోకి దింపుతోంది. పట్టణాల్లో రిసోర్స్‌ పర్సన్లు, గ్రామాల్లో సంఘ మిత్రలు వారి పరిధిలోని పొదుపు సంఘాల సభ్యులతో రిజిస్ట్రేషన్‌ చేయించనున్నారు. దీనిపై మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ పథకాల్లో లబ్ధిదారులతోనూ ఆటల పోటీల్లో పాల్గొనేలా రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రయత్నమూ చేయాలని అధికారులు వాలంటీర్లకు పరోక్షంగా సూచించారు. ప్రత్యేకించి విద్యా దీవెనలో 15 ఏళ్లు పైబడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదేశించారు.

CM's Review of Sports: క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్​

పోటీల్లో 35 లక్షల మంది పాల్గొనాలని నిర్ణయం:ఈనెల 15 నుంచి వచ్చే ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో 35 లక్షల మంది పాల్గొనేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇదంతా ఎన్నికల ముందు క్రీడా పరికరాలు, బహుమతుల పంపిణీ పేరుతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ పోటీలను రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అట్టహాసంగా నిర్వహించాలనుకుంటోంది. ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి తెస్తున్నా ఈ కార్యక్రమానికి చాలా చోట్ల స్పందన నామమాత్రంగానే ఉంది.

  • విశాఖ జిల్లాలోని 607 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.38 లక్షల మంది పేర్లు నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా శనివారం వరకు 640 మందే ముందుకు వచ్చారు.
  • నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ సచివాలయంలో 46 పేర్లే నమోదయ్యాయి. మరో 204 మంది కోసం ఉద్యోగులు జల్లెడ పడుతున్నారు.
  • చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఒక వార్డు సచివాలయంలో 250 మందికిగాను, 50 మందే పేర్లు నమోదు చేసుకున్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’కు ప్రజల నుంచి స్పందన ఉండటం లేదు.
  • మా పరిధిలోని ఇళ్లకు వెళితే మీకేం పని లేదా? అని ప్రజలు చిరాకు పడుతున్నారని కృష్ణా జిల్లా కానూరుకు చెందిన వార్డు వాలంటీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details