అన్న క్యాంటీన్లు తెరవాలని... అఖిలపక్షం దీక్ష - darna
అన్న క్యాంటీన్లను తక్షణమే తెరవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షకు దిగారు.
అన్న క్యాంటీన్లు పున ప్రారంభించి పేదలను ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. అన్న క్యాంటీన్లలో పనిచేసే కార్మికులు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహించారు. అఖిలపక్ష నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అన్న క్యాంటీన్లను మూసివేశారని ముస్లిం, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హీదాయత్ ఆరోపించారు. వీటిని మూసివేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా సామర్ధ్యం మూడు నెలల్లోనే బట్టబయలైందని తెదేపా నేత శ్రీనివాసరావు విమర్శించారు. త్వరగా వీటిని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. క్యాంటీన్లను మూసివేయడం వలన తాము ఉపాధి కోల్పోయామని కార్మికులు వాపోతున్నారు.