ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FOOD BANKS: పేదల ఆకలి తీర్చే ఫుడ్ బ్యాంకులు - గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ మనోహర్ నాయుడు

వివాహాలు, వేడుకలు చేస్తాం..! భోజనాలు అయ్యాక మిగిలినది పారేస్తాం..! అదే ఆహారం పాడేయకుండా.....రోడ్లపై తిరిగే నిరుపేదలకు అందిస్తే..! మంచి ఆలోచనే..! కానీ ఆచరించేదెవరు.? ఆ ఆలోచననే నిజం చేయాలనుకుంటోంది గుంటూరు నగరపాలక సంస్థ. నగరంలో ఐదు ప్రాంతాల్లో ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి..మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు పంచిపెట్టేందుకు సిద్ధమవుతోంది.

food banks in guntur
గుంటూరులో ఫుడ్ బ్యాంకులు

By

Published : Jun 29, 2021, 11:18 AM IST

గుంటూరులో ఫుడ్ బ్యాంకుల ఏర్పాటు

ఎక్కడైనా వేడుకలు జరిగితే..భోజనాలు పెడతారు. కచ్చితంగా ఆహారం మిగిలిపోతుంటుంది. దాన్ని చెత్తకుప్పల్లో పడేస్తుంటారు. అలాంటి ఆహారాన్ని సేకరించి ఆకలితో అలమటిస్తున్న పేదలకు అందించేందుకు.. గుంటూరు నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. వివాహాలు, వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి పేదలకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దానికోసం ప్రత్యేకంగా నగరంలో ఐదు ప్రాంతాల్లో.. వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జనం ఎక్కువగా ఉండే గాంధీపార్కు, జీజీహెచ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, లాడ్జి సెంటర్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్‌ బ్యాంక్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.

నగరంలో ఐదు చోట్ల ఏర్పాటు చేస్తున్న ఫ్రిడ్జ్‌ల్లో నాన్‌వెజ్‌కి, వెజ్‌కి వేర్వేరు ర్యాక్‌లు ఉంటాయి. ఆహారాన్ని దానం చేయాలనుకునే వారు ఆ ఫ్రిడ్జ్‌ల్లో పెట్టాలి. ఆ ఆహారాన్ని ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకి నగరపాలక సంస్థ ఉద్యోగి ద్వారా అందిస్తామని..గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడు తెలిపారు. ఆహారాన్నే కాకుండా దుస్తులు కూడా అందజేయవచ్చని.. దుస్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తామని.. మేయర్‌ మనోహర్‌నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details