గుంటూరు జిల్లాలో కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు, ముఖ్యంగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊళ్ల నుంచి కనీసం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. పసుపు, మిర్చి, కంద వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దొండ, సొర వంటి తీగజాతి కూరగాయ పందిళ్లు నీటిపై తేలి కనిపిస్తున్నాయి. అరటి తోటలు సగం మేర నీటిలో ఉన్నాయి.
ప్రతి ఏటా అదే సమస్య... వరద పోటుతో తీరని వేదన - గుంటూరు జిల్లాలో నీట మునిగిన పంటపొలాలు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వరద నీటిలో ఊళ్లు, పొలాలు మునిగి పోయాయి. గుంటూరు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో నీటి పాలవటంతో ఆవేదన చెందుతున్నారు.
గుంటూరు జిల్లాలో ముంచెత్తిన వరద
వరద తీవ్రత బట్టి లంక గ్రామాల ప్రజలని అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కానీ ఈసారి అలాంటి చర్యలేవీ అధికారులు చేపట్టలేదు. కంద, దొండ వంటి పంటలు చేతికొచ్చే వేళ నీటి పాలవటంతో తీరని నష్టం మిగిలింది. గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్నామని..ఇప్పుడు అదే జరిగి పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: జూరాల ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల