గుంటూరు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతాలు ముంపు ముప్పు నుంచి బయటపడలేదు. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని గ్రామాల్లో తీవ్రత అలాగే ఉంది. ప్రకాశం బ్యారేజికి 9 లక్షల క్యూసెక్కులు వరద వస్తుందన్న అధికారుల ప్రకటనతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే... వరద తీవ్రత తగ్గటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రకాశం బ్యారేజి నుంచి కొనసాగుతోంది.
నాలుగు రోజులుగా వచ్చిన వరదతో నదీ తీర గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట చేతికి దక్కే అవకాశాలు కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. నీట మునిగిన పైర్లను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. వంగ, చామంతి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. కొన్ని చోట్ల గ్రామాల్లోకి కూడా నీరు చేరింది.