అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని గుంటూరులో అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. కొత్తపేట నాజ్ సెంటర్లో ఫైర్ విన్యాసాలు నిర్వహించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, ఇతర పరిస్ధితులలోనూ జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తీరును వివరించారు.
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యం వహిస్తే భారీ ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర, రిటైర్డ్ అగ్నిమాపక అధికారి సాయిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.