Warning About Summer Fires: చెట్లు పెంచితే కొండంత అండ.. వాటిని విచ్చలవిడిగా నరికేస్తే భరిచంలేనంత ఎండ..! మానవ తప్పిదాలు, ప్రకృతిలో సంభవిస్తున్న పెనుమార్పులతో.. వేసవిలో సగటు కంటే ఎక్కువగా సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి అగ్నిప్రమాదాల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. అందుకే ముందుజాగ్రత్తలు తప్పనిసరని.. లేకుంటే భారీ మూల్యం తప్పదని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
వేసవికాలంలో భానుడి భగభగలకు.. తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఏమరపాటుగా ఉంటే విలువైన ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎండ తాపానికి రోడ్డుపై వెళుతున్న వాహనాల్లోనూ హఠాత్తుగా మంటలు రేగుతున్నాయి. అక్కడికక్కడే తగులబడిపోతున్నాయి.
ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం జుజ్జూరులో.. హైవేపై వెళుతున్న లారీ క్యాబిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వాహనం నుంచి దిగటంతో ప్రాణనష్టం తప్పింది. వేసవిలో ఈ తరహా ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
వేసవిలో వాహనం నడిపేటప్పుడు వైర్లను పరిశీలించాలని.. రేడియేటర్ వేడెక్కకుండా చూసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనంలో ఎప్పుడూ అగ్నిమాపక పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. గ్రామాల్లో వేసవిలో అధికంగా గడ్డి మోపులు కాలిపోతుంటాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పట్టణాల్లో మాల్స్, గోడౌన్స్, కంపెనీల్లో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.