సికింద్రాబాద్ డెక్కన్ నిట్ వేర్ దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ కీలక కసరత్తు దిశగా అడుగులేస్తోంది. భవిష్యత్తులో భారీ అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమైంది. అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే విషయంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇటీవల సమీక్ష నిర్వహించిన దృష్ట్యా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రానున్నది వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలకు ఆస్కారమున్నందున త్వరగా కసరత్తు పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం పోలీస్, పురపాలక శాఖల సహకారం తీసుకోనుంది.
ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా జరిగే అవకాశముండటంతో వాటిపై దృష్టి సారించనుంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మీటర్ల లోపు ఉన్న భవనాలకు అగ్నిమాపక అనుమతులు అగ్నిమాపకశాఖ పరిధిలోకి రావు. అవన్నీ జీహెచ్‌ఎంసీనే పర్యవేక్షించాలి. అయితే భారీ భవంతుల విషయంలో ఈ రెండు శాఖల వద్ద స్పష్టమైన వివరాలు లేవు. ప్రతీ భవనాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బంది సైతం అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో తాజా సమీక్ష అనంతరం బహుళ అంతస్తులన్నింటిలో అగ్నిమాపక వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు.