Secunderabad fire accident Updates: తెలంగాణలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. అయిదు అంతస్తుల భవనం, పెంట్‌హౌజ్‌లో డెక్కన్ నైట్‌వేర్ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి. మంటలు అయిదు అంతస్తుల భవనంతో పాటు పెంట్ హౌజ్‌కు విస్తరించాయి. సమీపంలోని మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన స్థలంలో 22 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఏడున్నర గంటల పాటు శ్రమించి.. ఎట్టకేలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ జరిగింది...గతేడాది మార్చి, సెప్టెంబర్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘోర అగ్నిప్రమాదాలు మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో ఘటన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. నల్లగుట్ట ప్రాంతంలో ఉన్న ఓ ఐదంతస్తులో భవనంలోని సెల్లార్‌ను కార్ల విడిభాగాలకు సంబంధించిన గోదాముగా వినియోగిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వస్త్ర దుకాణం ఉండగా... మొదటి అంతస్తులో డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణం కొనసాగుతోంది. పైమూడంతస్తులను వివిధ రకాల వస్తువులతో గోదాములుగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయం పదిన్నర గంటలకు షాపింగ్ కాంప్లెక్స్ తెరుచుకున్న పదినిమిషాల్లోపే స్వల్పంగా మొదలైన మంటలు... క్షణాల్లోనే పెద్దఎత్తున వ్యాపించాయి. తొలుత చిన్న ప్రమాదంగా భావించినప్పటికీ.... ఒక్కసారిగా భవనమంతా అలుముకున్న పొగ, ఎగిసిపడుతున్న మంటలతో వివిధ అంతస్తుల్లో ఉన్న వారంతా బయటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారంతో వెంటనే మూడు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకోగా... అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
భవనంలో క్రమంగా వ్యాపించిన మంటలు... పెద్దఎత్తున ఎగిసిపడి, పైఅంతస్తులకు వ్యాపించాయి. కార్ల విడిభాగాల గోదాము, వస్త్ర దుకాణం నుంచి మొదటి అంతస్తుల్లో ఉన్న క్రీడాసామాగ్రి దుకాణంతో పాటు పైనున్న అన్ని అంతస్తులకు అంటుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి.... సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా.... పైనున్న వారిని దించటం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి, అతి కష్టంమీద భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చారు. మరో ఇద్దరు వ్యక్తులు భవనంలోనే ఉండిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఫోన్ చేసినా... స్పందించకపోవటంతో.... వారిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొలుత మూడు ఫైరింజన్లు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరో మూడింటిని ఘటనాస్థలికి తెప్పించి...ఆరు పైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా...గంటల తరబడిగా పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. మొత్తం 22 ఫైరింజన్లు, వందలాది మంది అగ్నిమాపక, డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ, 108 సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనా.... మంటలు అదుపులోకి రాకపోగా.... అంతకంతకూ ఎక్కువవుతూ వచ్చాయి. దట్టంగా అలుముకున్న పొగతో పలువురు సహాయక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు.