గుంటూరు జిల్లా మంగళగిరి చినపంజా వీధిలో అగ్నిప్రమాదం జరిగింది. పంజా వీధిలోని ఓ బట్టలు, బొమ్మల దుకాణంలో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంగళగిరి అగ్నిమాపక వాహనం అందుబాటులో లేదని.. గుంటూరుకు ఫోన్ చేయాలని అధికారులు చెప్పారు. వెంటనే విజయవాడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. అక్కడి నుంచి వాహనం వచ్చేలోపు బట్టల దుకాణంలో ఉన్న వస్త్రాలు మొత్తం కాలిపోయాయి.
పక్కనే ఉన్న బొమ్మల దుకాణంలో స్వల్ప నష్టం వాటిల్లింది. విజయవాడ నుంచి వచ్చిన అగ్నిమాపక శకటం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దాదాపు రూ.4 లక్షల విలువైన నష్టం వాటిల్లిందని దుకాణ యజమాని తెలిపారు.