ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖలో పదోన్నతుల ముడుపులపై ఆరా! - guntur latest news

స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖలో పదోన్నతుల వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. గుంటూరు జిల్లాలో పోస్టింగులకు ముడుపులు ఆశ జూపడం వంటి వాటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులు ప్రభుత్వ దృష్టికి వెళ్లటంతో... ఈ అక్రమాలపై విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం గుంటూరు జోన్‌ డీఐజీ దామోదరరావును ఆ బాధ్యతల నుంచి తప్పించి ఒంగోలు డీఐజీ విజయలక్ష్మికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది.

find out about promotions in the stamps-registration‌ department in guntur
స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖలో పదోన్నతుల ముడుపులపై ఆరా!

By

Published : Jan 18, 2021, 4:19 PM IST

స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లకు గ్రేడ్‌-2 సబ్‌రిజిస్ట్రార్లుగా, గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1 సబ్‌రిజిస్ట్రార్లుగా ఉద్యోగోన్నతి కల్పించి వారికి కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగులిచ్చే వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ప్రభుత్వం గుర్తించి మొత్తం ప్రక్రియను ఇటీవల నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం వెనుక గుంటూరు జోన్‌ పరిధిలోకి వచ్చే పలు స్టేషన్లకు ముడుపులు ముట్టజెప్పి పోస్టింగులు దక్కించుకోవాలని ప్రయత్నించారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. పోస్టింగులకు ముడుపులు ఆశ జూపడం వంటి వాటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులు ప్రభుత్వ దృష్టికి వెళ్లడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ అక్రమాలపై విచారణ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం గుంటూరు జోన్‌ డీఐజీ దామోదరరావును ఆ బాధ్యతల నుంచి తప్పించి ఒంగోలు డీఐజీ విజయలక్ష్మికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. తొలి నుంచి గుంటూరు జోన్‌లో రిజిస్ట్రేషన్‌ పోస్టింగుల విషయంలో పెద్దమొత్తంలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలపై చర్యలకు సిద్ధపడడంతో రాష్ట్రంలోని మిగిలిన జోన్ల రిజిస్ట్రేషన్‌ అధికారులు గుంటూరు జోన్‌లో చోటుచేసుకున్న అక్రమాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారని శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి ఎవరిపై వేటు పడుతుందోనని వణికిపోతున్నారు.

వీటి కోసం పోటీ!

గుంటూరు జోన్‌ పరిధిలోకి వచ్చే గుంటూరులోని కొరిటిపాడు, వినుకొండ, నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట, ప్రకాశంలో మార్టూరు సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టింగులకు సంబంధించి బేరసారాలు జరిగినట్లు సమాచారం. ఈ కార్యాలయాల కోసం కొందరు జూనియర్లు పోటీపడి వాటిని తమకే కేటాయించాలని లాబీయింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే కొరిటిపాడు, స్టోన్‌హౌస్‌పేట కార్యాలయాలకు ప్రస్తుతం గ్రేడ్‌-2 సబ్‌రిజిస్ట్రార్లుగా ఉంటూ గ్రేడ్‌-1 సబ్‌రిజిజిస్ట్రార్‌గా పదోన్నతులు పొందిన వారికే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఇవ్వాలని, అందుకు విరుద్ధంగా జూనియర్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని కొందరు సీనియర్లు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో స్పందించిన శాఖ ముఖ్యకార్యదర్శి తిరిగి ఉత్తర్వులు ఇచ్చేవరకు కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని ఆదేశించడంతో ఆ పోస్టింగ్‌లపై ఆశలు పెట్టుకున్న వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు సీనియర్లు మాత్రం ఈసారి ఆ పోస్టింగ్‌లు తమకు దక్కుతాయని ఆశాభావంతో ఉన్నారు. జోన్‌లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఇద్దరు ఒకరేమో నెల్లూరు జిల్లా స్టోన్‌హౌస్‌పేట పోస్టింగ్‌ కోసం, మరొకరు గుంటూరు జిల్లా కొరిటిపాడు పోస్టింగ్‌ కోసం బాగా లాబీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరిటిపాడులో రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఉన్నారు. ఇక్కడ పోస్టు ఖాళీ లేకపోయినా ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ ఈ పోస్టింగ్‌పై కన్నేసి ఉన్న అధికారిని తప్పించి తనకు పోస్టింగ్‌ వేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. పనిచేస్తున్న అధికారులకు పొగబెట్టి మధ్యే మార్గంగా లాబీయింగ్‌ ద్వారా సదరు ఉద్యోగి ఇక్కడకు ఎందుకు రావాలనుకుంటున్నారు? తొలి పోస్టింగ్‌ ఎక్కడ వేస్తే అక్కడకు వెళ్లాల్సింది పోయి ప్రత్యేకంగా ఈ పోస్టింగ్‌ను ఏరికోరి ఎందుకు కోరుకుంటున్నారో కూడా ఆరా తీస్తున్నారని వినికిడి. ప్రస్తుతం గ్రేడ్‌-1 సబ్‌రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారికి తిరిగి పోస్టింగులు ఇవ్వటానికి ఖాళీలు లేవని, దీంతో కొందరు తమను ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయాల్లోనే కొనసాగించాలని చెప్పి లాబీయింగ్‌ జరిపారని వినికిడి. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

పోస్టింగులకు ఏసీబీ కేసులు ఏమైనా ఉన్నాయా?

ప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జోన్‌ పరిధిలో నెలకొన్న ఖాళీలకు ఎవర్ని ఎంపిక చేశారు? వారి గత పనితీరు ఎలా ఉంది? గతంలో ఏమైనా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నారా? గతంలో జరిగిన ఏసీబీ దాడుల్లో ఎవరిపైన అయినా అభియోగాలు నమోదైతే వారికి తిరిగి ఫోకల్‌ స్టేషన్లకు సిఫార్సు చేశారా? లేక లూప్‌లైన్‌ పోస్టులకే వారిని పరిమితం చేశారా అనేది కూడా చూస్తున్నారు. కొందరిపై ఏసీబీ అభియోగాలు ఉన్నా అవేం పట్టించుకోకుండా ఫోకల్‌ స్టేషన్లు ఇవ్వడానికి సిఫార్సు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం వీటన్నింటిపై విచారణ జరగనుండడంతో పదోన్నతుల మాట దేవునికి ఎరుక ఈ వ్యవహారం మరింత రచ్చకాకుండా ఉంటే చాలనుకుంటున్నారు కొందరు ఆశావహులు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు డీఐజీ కార్యాలయం, గుంటూరు ఆర్వో, చిట్స్‌ కార్యాలయం, పెదకూరపాడు, వినుకొండ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ ఖాళీలు ఉన్నాయి.

ఇదీ చదవండి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతి

ABOUT THE AUTHOR

...view details