Buggana Rajendranath Reddy: మనం మొక్కలు నాటడం అంటే.. ఆశ, శాంతి అనే విత్తనాలను నాటినట్లే. మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే’ ఇవి కెన్యాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త వంగారి మతాయి చెప్పిన మాటలు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని చెబుతూ ఆమె మాటల్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు.
1. వాస్తవం.. కొత్తగా మొక్కలు నాటడం మాట అటుంచి, వైసీపీ ప్రభుత్వం ఉన్న చెట్లనే బతకనివ్వడం లేదు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళుతుంటే.. ఆయన భద్రత చర్యల్లో భాగమంటూ, అంతెత్తున పెరిగిన చెట్లనూ, కొమ్మల్నీ ఎడాపెడా నరికేస్తున్నారు. ఒకపక్కన చెట్లను నరికేస్తూ, మరోపక్క పర్యావరణానికి అగ్రపాధాన్యమిస్తున్నామని బుగ్గన చెప్పడం విడ్డూరమే మరి.
భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు, అత్యంత ధర్మబుద్ధులు’అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ వ్యాఖ్యలివి. తమది అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వమని, నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే ప్రభుత్వమని, రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వమని చెబుతూ.. బుగ్గన.. థామస్ జెఫర్సన్ వ్యాఖ్యల్ని కోట్ చేశారు. ‘ప్రతి వస్తువును రిటైల్‌గా కొని, తాను పండించిన దాన్ని హోల్‌సేల్‌గా అమ్మేవాడే రైతు’- అంటూ మరో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చేసిన వ్యాఖ్యల్నీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి తామెంతో ప్రాధాన్యమిస్తున్నామో చెప్పుకొచ్చారు.
2. వాస్తవం..వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఘనంగా చూపుతూ, ఖర్చు దగ్గరకు వచ్చేసరికి భారీగా కోత పెట్టడమేనా ఆ రంగానికి మీరిచ్చే ప్రాధాన్యం బుగ్గన గారూ! 2019-20 బడ్జెట్ కేటాయింపుల్లో 46.40 శాతం, 2021-22 బడ్జెట్ కేటాయింపుల్లో 59.86 శాతం మాత్రమే ఖర్చు పెట్టడాన్ని ఏమనాలి? నాలుగేళ్లుగా రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాల్ని ఇవ్వకపోవడం, 2022-23 బడ్జెట్‌లో ఏడు లక్షల మందికి ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వకపోవడం, కీలకమైన సూక్ష్మ పోషకాల పంపిణీని గాలికొదిలేయడం, సూక్ష్మ సేద్యం పథకాన్ని మూడేళ్లుగా అటకెక్కించడం, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర వాటా నిధులివ్వకపోవడం.. ఇదేనా మీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్న మేలు!!
నీరము తప్ప లోహమున నిల్చి... అనే భర్తృహరి సుభాషితం ఈ విధంగా చెబుతుంది. వర్షపు చినుకు భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. సలసలా కాగుతున్న ఇనుము మీద నీటిచుక్క పడితే అది క్షణాల్లో ఆవిరవుతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే తళతళ మెరుస్తుంది. ఆల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది. రైతన్నల పొలాల్లో పడితే మొక్కలుగా మొలచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది.’ నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందంటూ.. బుగ్గన భర్తృహరి సుభాషితాన్ని ప్రస్తావించారు.
3. వాస్తవం.. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు అంతంతే. కేటాయించిన వాటిలో సగం నిధులూ ఖర్చు చేయలేదు. నెల్లూరు, సంగం బ్యారేజీల్ని తప్ప ఏ ప్రాజెక్టునూ ఇంతవరకు పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టును 2024 జూన్‌లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా, ఈ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.101.47 కోట్ల్లే. 2022-23 బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 9 వేల810 కోట్ల కేటాయింపులు చూపించి, ఈ జనవరి నెలాఖరుకు చేసిన ఖర్చు కేవలం 3 వేల514 కోట్లు. ఇదేనా బుగ్గన గారూ సాగునీటి రంగానికి మీరిచ్చే ప్రాధాన్యం?