రాజధాని రైతుల పోరు.... 21వరోజుకు చేరింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో రోజు రోజుకూ ఆందోళన ఉద్ధృతం చేస్తున్న అమరావతి ప్రాంత వాసులు నేడు మరో అడుగు వేస్తున్నారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి దిగ్భందనం చేయబోతున్నారు. మంగళగిరి మండలం చినకాకాని వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగే రహదారి ముట్టడిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో పాటు తెలుగుదేశం, జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నట్లు సమాచారం. 29 గ్రామాల ప్రజలు రహదారి దిగ్భందనానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే సకలజనులసమ్మె, రాజధాని బంద్, తుళ్లూరు నుంచి మందడం వరకు భారీ ర్యాలీలతో ఉద్యమవేడిని పెంచుతున్న రైతులు..ఇవాళ్టి జాతీయ రహదారి దిగ్భందనాన్ని ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. మహిళలు కూడా.. ధర్నాలు, రీలే దీక్షలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతి సాధన కోసం చావోరేవో తెల్చుకుంటామని తెగేసి చెబుతున్నారు.