Fifth Day of Anganwadi Workers Agitation In AP: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఐదో రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు గళమెత్తారు. విజయవాడ అలంకార్ కూడలిలో నిరసన తెలిపారు. ధర్నాచౌక్‌లో మహిళల ఆందోళనకు టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలులో ధర్నా చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వీరికి సంఘీభావం ప్రకటించారు. చీరాలలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎర్ర రంగు వస్త్రాలు ధరించిన అంగన్వాడీలు ధర్నాలో పాల్గొన్నారు.
ఒంగోలులో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. సంతనూతలపాడు, మద్దిపాడులో అంగన్వాడీల ఆందోళనలకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.
ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు
గిద్దలూరులో కళ్లకు గంతలు కట్టుకొని ధర్నా చేశారు. మార్కాపురం సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు కొనసాగాయి. కొన్నిచోట్ల అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి తెరిచినా, పిల్లలు ఎవరూ రాక తరగతులు ఖాళీగా దర్శనమిచ్చాయి. నెల్లూరులో అంగన్వాడీలు ర్యాలీ చేశారు.
అనంతపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరసన తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గణేష్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేశారు. కనీస వేతనం 26 వేలు, గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు. కడప ఐసీడీఎస్ వద్ద సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు