ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబులనాయుడుపాలెం అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలన - Observation of authorities on illegal soil excavations in Obulanayudupalem

గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో మట్టి అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. ఈ ప్రాంతంలో మట్టి తవ్వకాలపై ప్రచురితమైన "అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టి తవ్వకాలు" అనే ఈటీవీ భారత్-ఈనాడు కథనాలకు స్పందించిన అధికారులు వీటిపై వేగంగా చర్యలు చేపట్టారు.

Mines Assistant Director  Vishnuvardhan Rao
గనులశాఖ సహాయ సంచాలకుడు విష్ణువర్ధన్‌రావు

By

Published : Jul 2, 2021, 1:32 PM IST

గుంటూరు గ్రామీణ మండలం ఓబులనాయుడుపాలెంలో.. మట్టి అక్రమ తవ్వకాలపై "అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టితవ్వకాలు" అనే ఈటీవీ భారత్-ఈనాడులో వచ్చిన కథనాలపై భూగర్భ గనులశాఖ అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మట్టి తవ్వకాలను పరిశీలించారు.

రాత్రి వేళల్లో తవ్వకాలు..

ఈ ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్ ఉండటంతో మైనింగ్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. భూగర్భ గనుల శాఖ అనుమతులు ఉంటేనే తవ్వకాలు జరపాలి. కానీ అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగుతున్నాయి. పగలైతే ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని ప్రైవేటు వెంచర్లకు అమ్ముకుంటున్నారు. జేసీబీల సాయంతో మట్టి తవ్వటం, భారీ వాహనాల సాయంతో తరలించటం యథేచ్ఛగా జరుగుతోంది.

గడువు ముగిసినా..

గనులశాఖ అధికారులు గతంలో ఇచ్చిన లీజుల గడువు ముగిసినా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతంలోనే ప్రైవేటు వ్యక్తుల భూములూ ఉన్నాయి. తమ భూముల్లో తవ్వుతారనే ఉద్దేశంతో వారు కంచె వేసుకున్నారు. మరికొందరు ప్రహరీ కట్టుకున్నారు. ప్రైవేటు భూముల సరిహద్దుల వరకూ తవ్వకాలు జరిగాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. సాధారణంగా 6మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వటానికి నిబంధనలు అనుమతించవు. కానీ ఇక్కడ 10మీటర్లకు పైగా తవ్వకాలు జరిగాయి. మరికొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ లోతులో తవ్వారు. భారీ స్థాయిలో ఏర్పడిన గుంతలే ఇందుకు నిదర్శనం. ఇటీవల వర్షాలకు ఈ గుంతల్లోకి నీరు వచ్చి చేరింది.

వీటిపై మీడియాలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే చేసి.. తవ్వకాలు ఎంత మేర జరిగాయో తేల్చనున్నట్లు గనులశాఖ సహాయ సంచాలకుడు విష్ణువర్ధన్‌రావు తెలిపారు. అనుమతికి మించి తవ్వినట్లు తేలితే జరిమానా విధిస్తామన్నారు.

ఇదీ చదవండీ..space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

ABOUT THE AUTHOR

...view details