Tormula E RACE In Hyderabad: హైదరాబాద్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న ఫార్ములా ఈ రేస్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ తీరాన రయ్ మంటూ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్లేందుకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. అటు లేజర్ షో.. ఇటు ఫార్ములా-ఈ రేస్ జరగనుండటంతో ట్యాంక్ బండ్ ప్రాంతం పలు పనులతో రద్దీగా మారింది. ఫిబ్రవరి 11 న ఫార్ములా ఈ-రేస్ జరగనుంది. ఈసారి తెలంగాణ అభివృద్ధి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లను చేస్తున్నారు. అందరూ ఈ పోటీల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా-ఈ రేస్ అంతర్జాతీయ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్ కాంపౌండ్ , ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోటీలను దృష్టిలో పెట్టుకొని ఈ రహదారికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పక్కన బారికేడ్లకు రంగులు అద్దుతున్నారు. 11 ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. వారం ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చే సూచనలున్నాయి. స్ట్రీట్ సర్క్యూట్‌కు ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతోపాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.