Use of diesel engines: వర్షాధార ప్రాంతాల్లో పంటలకు నీటితడులు ఇవ్వటానికి ఆయిల్ ఇంజన్లే ప్రధాన ఆధారం. చెరువులు, కాల్వలు, వాగులు, కుంటలు, బావుల ద్వారా నీటిని తోడి.. పైర్లకు ఇవ్వటానికి ఆయిల్ ఇంజన్లు ఉపయోగపడుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆయిల్ ఇంజన్ల వినియోగం తప్పనిసరి అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రభుత్వాలు ఆయిల్ ఇంజన్లకు రాయితీ ఇచ్చేవారు. అయితే గత కొన్నాళ్ళుగా ఈ రాయితీని నిలిపివేశారు. దీంతో అధిక ధరలకు ఆయిల్ ఇంజన్లను కొనుగోలు చేసే శక్తి లేక.. ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతున్నారు. ఇందులో బాగంగా.. ఆటో ఇంజన్లతో తయారుచేసే అసెంబుల్డ్ ఆయిల్ ఆయిల్ ఇంజన్లను ఇటీవల ఎక్కువగా వాడుతున్నారు. పూర్వం వాడుతున్న ఆయిల్ ఇంజన్లతో పోల్చితే.. కొన్ని అంశాలు అనుకూలంగా ఉండటంతో వీటిని ఎంపిక చేసుకుంటున్నారు.
ఇంజన్ ధర, నిర్వహణ, డీజిల్ మైలేజ్ పెరగటంతో వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మిరపతో పాటు రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న, జొన్న పైర్లకు నీటితడులు ఇస్తున్నారు. దూరం నుంచి నీరు తోడాల్సిన తరుణంలో ఒక్కోసారి రెండు ఇంజన్లు కూడా అవసరం అవుతున్నాయి. రాయతీపై ప్రస్తుతం ఇవ్వటంలేదు కాబట్టి.. మధ్యేమార్గంగా ఈ ఇంజన్లను కొనుగోలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఖర్చులు తగ్గించుకోవడంలో బాగంగా రైతులు తక్కువ ఖరీదులో దొరికే ఆయిల్ ఇంజన్ల కోసం వెదుకుతున్నారు. ఆటో ఇంజన్లు అనుకూలంగా ఉండటంతో ఇటువైపు చూస్తున్నారు. మామూలు ఆయిల్ ఇంజన్‌కు లీటరు డీజిల్ పోస్తే 30-45 నిముషాలు మాత్రమే ఆడుతుండగా.. ఆటో ఇంజన్ రెండు గంటలు పాటు ఆడుతుంది. డీజిల్ ఖర్చులు తగ్గుతుండటం వల్ల ఇది అనుకూలంగా ఉందని మెకానిక్‌లు చెబుతున్నారు.