Farmers Suffering due to Cyclone Michaung: అన్నదాత ఆగమాగం - తుపాను హెచ్చరికలతో ముందస్తు వరి కోతలు ముమ్మరం Farmers Suffering due to Cyclone Michaung: ఆకుపచ్చ రంగులో ఉన్న వరి పంటను కోస్తున్న ఈ దృశ్యాలు గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోనివి.. మిచౌంగ్ తుపానుకు భయపడి రైతులు 10 నుంచి 20 రోజుల తర్వాత కోయాల్సిన పంటను ముందుగానే వరి నూర్పిడి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 3 లక్షల ఎకరాలకుపైగా పంట పొలంలో ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో గాలులతో కూడిన వర్షం పడితే పంట మొత్తం నేలవాలిపోతుందనే భయం నెలకొంది.
ఇప్పటికే కొన్ని మండలాల్లో జల్లులు మెుదలయ్యాయి. కష్టపడి పండించిన పంట తుపాను బారిన పడితే ఎలా అనే ఆలోచనతో ముందస్తు వరికోతలు ప్రారంభించారు. ప్రస్తుతం కోత కోసిన పంటను 76 కిలోల బస్తా 1700 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. తుపాను ప్రభావానికి పంట నష్టపోవటం కన్నా తక్కువ ధరకైనా అమ్మేస్తున్నామని రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు
లక్షల ఎకరాల్లో పంట ఒకేసారి పంట కోతకు రావటంతో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి వరికోత యంత్రాలు గుంటూరు, బాపట్ల జిల్లాలకు తీసుకొచ్చారు. అవసరానికి తగిన యంత్రాలు అందుబాటులో లేకపోవటంతో మరికొన్న చోట్ల వరికోతలో జాప్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు.
ఇదే అదనుగా ధాన్యం వ్యాపారులు యంత్రాల ఖర్చులు చెల్లించి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఖర్చు మినహాయించుకుంటున్నారు. వారం రోజుల క్రితం వరకూ యంత్రాలు గంటకు 2 వేల 5 వందల నుంచి 2 వేల 7 వందల వరకు అద్దె తీసుకునేవారు. పస్తుతం 3 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.
బీ అలర్ట్ - తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - భారీగా కురుస్తున్న వర్షాలు
మిషన్ల ద్వారా కోతలు ముమ్మరం: కృష్ణా జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 10.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుపాను హెచ్చరికలతో అన్నదాతల ఆందోళన చెందుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట తుపానుపాలు అవుతుందేమోనని భయపడుతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులు మిషన్ల ద్వారా కోతలను ముమ్మరం చేశారు.
ధాన్యం కోనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 317 ధాన్యం సేకరణ కేంద్రాలను సిద్ధం చేసినా అవి రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ధాన్యం అమ్మకానికి సంబంధించి గత సంవత్సరం ఇలాగే ఇబ్బందులు పడ్డామని, ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు మెదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు తుపాను ముంచుకొస్తుంటే మరొక వైపు ధాన్యం ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మిచౌంగ్ తుపానుపై అప్రమత్తమైన ప్రభుత్వం - సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం
అదే విధంగా ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో కూడా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. పొలాల్లో, రోడ్లపై అరబెట్టి ఉన్న ధాన్యాన్ని కాటా వేసేందుకు అధికారులు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సంచుల కోరత తీవ్రంగా ఉందని, కాటా వేసేందుకు రావాలని అడుగుతుంటే సంచులు లేవని చెబుతున్నారని రైతులు తెలిపారు. ఒకే వేళ కాటా వేసినా ధాన్యం తీసుకువెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలోనూ మిచౌంగ్ తుఫాన్ ప్రభావం - మొదలైన వర్షాలు