మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు నినాదంతో తుళ్లూరులోని దీక్షా శిబిరాలు మారుమోగాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు చేస్తున్న మహాధర్నాకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. అమరావతి పరిరక్షణ సమితి, ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు వైద్యులు ఉచిత వైద్య సేవలను అందించారు. అనంతరం రైతులు, మహిళలు బాలఏసు చర్చికి పాదయాత్రగా వెళ్లారు. రాజధానిగా అమరావతి కొనసాగేలా సీఎం జగన్ మనసు మార్చాలంటూ ప్రార్థనలు చేశారు. నెక్కల్లు, నేలపాడుకు చెందిన రైతులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించి.. పాదయాత్రగా తుళ్లూరు మహా ధర్నా శిబిరానికి వచ్చారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమరావతిని కాపాడుకుంటామని రైతులు, మహిళలు శపథం చేశారు.
రైతులకు మద్దతుగా తెదేపా సహా పలు పార్టీలు
రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షకు తెలుగుదేశం సహా పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. రాజధానిలో పర్యటించిన భాజపా-జనసేన నేతలు రైతులతో మాట్లాడారు. ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనకు మృతి చెందిన అమరవీరులకు కొద్దిసేపు దీక్ష శిబిరంలో మౌనం పాటించారు. భాజపా అధిష్టానం మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజధాని సాధించేవరకు రైతుల పక్షానే పోరాడతమన్నారు. మహిళలు సైతం 24గంటల నిరహార దీక్షలో పాల్గొని ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. సినీనటుడు శివకృష్ణ మందడంలోని నిరసనల్లో పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని కోరారు.