ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిమ్మ పంటకు మద్దతు ధర కల్పించాలని రైతుల నిరసన - lemon Farmers protest latest news

నిమ్మ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గుంటూరు జిల్లా తెనాలిలో రైతులు ఆందోళన నిర్వహించారు. కరోనా ఆంక్షల కారణంగా ఎగుమతులు నిలిచిపోయి... నిమ్మ పంట ధర పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదుట నిమ్మకాయలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.

Farmers protest
Farmers protest

By

Published : Jun 28, 2021, 4:14 PM IST

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిమ్మ రైతులు నిరసన తెలిపారు. కిలో నిమ్మకాయలకు కనీస మద్దతు ధర రూ.25గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ధర స్థిరీకరణ నిధి ద్వారా రైతులను సర్కారు ఆదుకోవాలని కోరారు.

నిమ్మ రైతుల ఆవేదన..

'సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి కరోనా రెండో దశ వ్యాప్తి ఉండటంతో ఆంక్షలు విధించారు. ఎగుమతులకు అవకాశం లేకపోవటంతో పంట కొనుగోలు చేసే వారు లేక... కాయలను చెట్లకే వదిలేశారు. అవి పండిపోయి... నేల రాలుతున్నాయి. దీంతో పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉంది' అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మొదటి దశ కరోనా, లాక్​డౌన్​, పంట సరిగా పండక నష్టపోయామని... ఇప్పుడు అదే పునరావృతం అయ్యిందని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం న్యాయం చేయాలి...

రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేయటమే తప్ప... క్షేత్ర స్థాయిలో జరిగిందేమీ లేదని రైతు సంఘం కార్యదర్శి ఎం.శివ సాంబిరెడ్డి అన్నారు. మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం... కేవలం 100 కోట్లతో పెట్టటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలు సక్రమంగా ఉంటే... పంటను రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు.

ప్రజా పంపిణీ ద్వారా పంటలు అమ్మించే ప్రయత్నం సర్కారు చేపట్టాలని రైతన్నలు సూచించారు. ఆర్బీకేల ద్వారా అన్ని పంటలు కొనుగోలు చేయాలని కోరారు. డ్వాక్రా ద్వారా పులివెందుల అరటి రైతులను ఆదుకున్న తరహాలోనే నిమ్మ రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల కోసం సీఎం మాట్లాడిన మాటలను ఆచరణలో పెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:'సుబాబుల్​కి గిట్టుబాటు ధర కల్పించాలి'

ABOUT THE AUTHOR

...view details