Mahadharna of capital farmers: పేదల సీఎం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద రైతులకు అన్యాయం చేస్తున్నారని అమరావతి రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధానిలోని ఎస్సీలు పేదవాళ్లుగాకనబడట్లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూములిస్తే అమరావతి రైతులను రోడ్డున పడేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లింపులను నిలిపేయడంపై అమరావతి రాజధాని జేఏసీ ఆధ్వర్యాన రైతులు మహాధర్నా చేపట్టారు. విజయవాడ గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం 4 వరకు కొనసాగింది.
మండిపడిన రైతులు... ఒకవైపు రాజధాని అభివృద్ధి చేయకపోగా.. మరోవైపు పత్రాల సాకుతో వార్షిక కౌలు నిలుపుదల చేశారని రైతులు మండిపడ్డారు. తాము కోర్టుకు వెళ్తే వడ్డీతో సహా కౌలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం గ్రహించాలని రాజధాని రైతులు పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు 1310 రోజులుగా ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేస్తూ.. అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా?.. ఎస్సీలపై జగన్‌కు ఎందుకింత కక్ష అని అమరావతి రాజధాని జేఏసీ నేతలు ప్రశ్నించారు. వేరే ప్రాంతం వారికి ఇక్కడ ఇళ్లు అంటున్నారు సరే.. భూములిచ్చిన రైతుల పరిస్థితేంటి? అని దుయ్యబట్టారు. వార్షిక కౌలు కూడా చెల్లించని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. 'పేదల సీఎం అని చెప్పుకుంటూ.. వారికే న్యాయం చేయట్లేదు.. రాజధానిలోని ఎస్సీలు పేదవాళ్లుగా కనబడట్లేదా? నమ్మి భూములిస్తే అమరావతి రైతులను రోడ్డున పడేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.