ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తి పంటకూ ఈ -క్రాప్ సమస్య... ఆందోళనలో అన్నదాతలు

పత్తి రైతులకు ఈ-క్రాప్ సమస్య మెుదలైంది. పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్​ యార్డు దగ్గరికి తీసుకువస్తే... సీసీఐ నిబంధనలు వాళ్లకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారుల సమన్వయం లోపంతో...గుంటూరు జిల్లా పెదనందిపాడు ఉప మార్కెట్ యార్డులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ-భారత్ ప్రతినిధి వర ప్రసాద్ తెలియజేస్తారు.

farmers nervous for their cotton  crop in guntur
ఈ -క్రాప్ సమస్యపై పత్తి రైతుల ఆందోళన

By

Published : Dec 9, 2019, 11:28 PM IST

Updated : Dec 12, 2019, 5:26 PM IST

ఈ -క్రాప్ సమస్యపై పత్తి రైతుల ఆందోళన

గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు ఉప మార్కెటింగ్ యార్డులో నవంబర్ 22న పత్తి కొనుగోలు కేంద్రాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తిని విక్రయించుకునేందుకు అన్నదాతలు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నా... వాళ్ల ఇబ్బందులు తీరలేదు. సాంకేతిక కారణాల వల్ల సీసీఐ కొనుగోలు కేంద్రంలో తమ పేర్లు కనిపించడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులను అడగాలని చెప్పి పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్తే తాము ఈ-క్రాప్ చేశామని... వారినే అడగండి అని... చెప్పి వెనక్కి పంపుతున్నారని రైతులు వాపోతున్నారు.



పంటను నిల్వ ఉంచితే...రంగు మారుతోంది...

అధిక వర్షాలతో పత్తి దిగుబడులు బాగా తగ్గాయని...వచ్చిన కొద్దిపాటి పత్తిని సీసీఐ కేంద్రం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పత్తిని బయట అమ్ముదామంటే తక్కువ ధరకు అడుగుతున్నారని... సీసీఐలో పెట్టాలంటే నిబంధనల పేరుతో కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచితే...రంగు మారి తీవ్రంగా నష్ట పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

పత్తి చివరదాకా కొనుగోలు చేస్తాం

పత్తి సాగు అంతా ఈ క్రాప్​లో నమోదు చేశామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ వరకూ పత్తి కొనుగోలు జరుపుతామని మార్కెటింగ్​ శాఖ ఉపసంచాలకులు సువర్చల స్పష్టం చేశారు. పెదనందిపాడు సీసీఐ కేంద్రంలో 20 రోజులలో 1600 క్వింటాలు పత్తిని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఇంకా 25 వేల క్వింటాల వరకు పత్తి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి....ఈ క్రాప్ నిబంధనలు తొలగించి పత్తిని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం

Last Updated : Dec 12, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details