అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. ఇదే అదనుగా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు Urea shortage in joint Guntur district: గుంటూరు, బాపట్ల జిలాల్లో రబీ సీజన్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. ప్రస్తుతం పంట 20రోజుల నుంచి నెల రోజుల దశలో ఉంది. ఈ సమయంలో పంటకు బలం కోసం యూరియా తప్పనిసరిగా వేయాలి.. వెంటనే నీరు పెట్టాలి. అప్పుడే పైరు త్వరగా ఎదుగుతుంది. అయితే జిల్లాలో ప్రస్తుతం యూరియాకు కొరత ఏర్పడటం ఇబ్బందిగా మారింది. రైతు భరోసా కేంద్రాలతో పాటు డీసీఎంఎస్ కేంద్రాల్లో యూరియా సరిపడా లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ గరిష్ఠ చిల్లర ధరకే యూరియా లభిస్తుంది. పైగా ఇవి గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆశించారు. కానీ చాలాచోట్ల ఆర్బీకేలు, సొసైటీల్లో యూరియా నిల్వలేదనే మాట వినిపిస్తోంది. బహిరంగమార్కెట్‌లో యూరియాకు కొరత ఏర్పడటంతో వ్యాపారులు అధిక ధర వసూలుచేస్తున్నారు.
బస్తా గరిష్ఠ చిల్లర ధర రూ.266.50లు కాగా రూ.330ల నుంచి రూ.350ల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులకు వస్తున్న యూరియా కూడా రైతుల అవసరాలు తీర్చటం లేదు. దీంతో వారు కృత్రిమకొరత సృష్టించి అధిక ధర వసూలు చేస్తున్నారు. మరికొందరైతే ఇతర ఉత్పత్తులు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక పెడుతున్నారు. వేరే ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉండటంతో అవి అనవసరంగా కొని డబ్బులు వృథా చేసుకోలేని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈసారి సాధారణ విస్తీర్ణాన్ని మించి మొక్కజొన్న సాగయింది. గుంటూరు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 18459 హెక్టార్లు కాగా 24291 హెక్టార్లు సాగయింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7వేల హెక్టార్లకుగానూ 15వేలు, బాపట్ల జిల్లాలో 24580 హెక్టార్లకు 28902 హెక్టార్లు సాగయింది. దీంతో ప్రణాళికకు మించి యూరియా అవసరాలు పెరిగాయి. వ్యవసాయశాఖ శాస్త్రవేత్తల ప్రకారం మొక్కజొన్నకు ఎకరాకు గరిష్ఠంగా 3బస్తాలు వాడాల్సి ఉండగా రైతులు 8 నుంచి 12బస్తాల వరకు వేస్తున్నారు. దీంతో లెక్కకు మించి డిమాండ్ ఏర్పడుతోంది.
ఈ మూడు జిల్లాల్లో నెలలవారీగా సరఫరా చేయాల్సిన యూరియాకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించినా కొన్నాళ్లుగా రైల్వేరేక్‌లు సరిపడా రాకపోవటం సమస్యగా మారింది. రేక్ బుక్ చేసిన 15రోజుల తర్వాత కూడా లోడ్ రావటం లేదు. దీంతో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో యూరియా నిల్వలు క్రమంగా తరిగిపోయాయి. ఆర్బీకేలకు వచ్చిన యూరియా వచ్చినట్లే రైతులు తీసుకెళ్తున్నారు. డీసీఎంఎస్, సొసైటీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ డిమాండ్‌ను కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా లోడ్ రాగానే తమ వారికి మాత్రమే సమాచారమిచ్చి తీసుకెళ్తున్నారు. ఆర్బీకేల వద్దకు వచ్చిన రైతులకు మొండిచేయే ఎదురవుతోంది.
ఇవీ చదవండి: