ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Lost Crops: 'సంక్షేమ పథకాలు ఇస్తే సరికాదు.. ఇలాంటి సమయంలో ఆదుకోవాలి..' - గుంటూరు జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు

Farmers Lost Crops Due to Rains: వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్‌ పట్టలు ఉపయోగిస్తారు. పట్టలు కప్పడం వల్ల కొంతలో కొంత నష్టాన్ని తప్పించుకోవచ్చు. అయితే బయట ఎక్కువ ధరకు కొనలేక, ప్రభుత్వం నుంచి రాయితీ పట్టలు అందక.. ఇటీవల వర్షాల సమయంలో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. దీనివల్ల పంటలు తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 11, 2023, 9:14 AM IST

పట్టలు లేక పంటలు పోయాయ్​

Farmers Lost Crops Due to Rains: ఇటీవల కురిసిన అకాల వర్షాలు.. గుంటూరు జిల్లా రైతులను దారుణంగా దెబ్బతీశాయి. కల్లాల్లో ఆరబోసిన పంట చాలా చోట్ల వర్షార్పణమైంది. సరైన సమయంలో పట్టలు లేక.. మిర్చి, మొక్కజొన్న వర్షానికి తడిసిపోయాయి. కొన్నిచోట్ల అయితే పంట.. నీళ్లలో తేలియాడిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో పట్టలు లభ్యం కాకపోవడంతో.. కొందరు మిర్చి రైతులు నేలపైనే పంటను ఆరబెట్టుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పంట నాణ్యత దెబ్బతింది.

మిర్చి ఎర్రకాయలు కాస్త తాలుకాయల్లా తెల్లగా మారి.. సగానికి సగం ధర పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడంలో టార్పాలిన్‌ పట్టలు చాలా ముఖ్యం. ఈసారి రైతులందరికీ ఒకేసారి సమస్య ఎదురుకావడంతో.. పట్టల కోసం పరుగులు తీశారు. బయట మార్కెట్లో 10వేలు పెట్టి కొందరు కొన్నప్పటికీ.. అంత భారం భరించలేక కొందరు సిమెంట్‌ సంచులను పట్టలుగా కుట్టించి వాడుకున్నారు. అలా చేయడమూ కుదరక కొందరి రైతుల పంటలు నీట తడిసిపోయాయి. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కాగా.. ప్రస్తుత వర్షాలకు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. రాయితీపై పట్టాలు పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

"కోత కోసిన 15, 20 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం అందించలేదు. ఇలాంటి సమయంలో పట్టాలు ఉండాలి.. బయట ఒక్కో పట్ట ధర 10,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికే మేము పంటకు చాలా పెట్టుబడులు పెట్టాము. పట్టలను అంత ధర పెట్టి బయట కొనాలంటే మాకు అధిక భారం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తుందని కాదు.. ఇలాంటి సమయాల్లోనే మమ్మల్ని ఆదుకోవాలి." - స్థానిక రైతు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎర్రగా ఉండాల్సిన మిర్చికాయలు.. వర్షం కారణంగా తెల్లగా మారిపోయాయి. పంట నాణ్యత దెబ్బతినటంతో సగానికి సగం ధర పడిపోయింది. బయట పట్టలు కొనుగోలు చేయటం అధిక భారం కావటంతో పక్క రైతుల పట్టలను తెచ్చేందుకు ప్రయత్నించాము. అయినా కూడా పంట వర్షార్పణమైంది. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయం అందలేదు. ఆర్​బీకే సహాయం చేస్తుందని అనుకున్నాము.. కానీ అది జరగలేదు." - స్థానిక రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details