ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Suffering: రైతుల ఆవేదన.. ప్రభుత్వానికి పట్టదా..? - Problems of farmers in Andhra Pradesh

Farmers Suffer due to Untimely Rains: అకాల వర్షాలతో చేతికొచ్చే దశలోని పంటలు దెబ్బతింటున్నా.. మద్దతు ధరలు దక్కక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడట్లేదు. వారంరోజులకు పైగా అకాల వర్షాలు కురుస్తున్నా.. పంట నష్టాలు, రైతుల కష్టాలపై.. ఆదుకునే చర్యలు కనిపించడం లేదు. కనీసం సమీక్ష కూడా చేయడం లేదు. పంటలకు మద్దతు ధరలు కల్పించడం పైనా ఎలాంటి పట్టింపూ లేదు. నిండా మునిగిపోయామని రైతుల గగ్గోలు పెడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్‌ సహా ఎవరూ పట్టించుకోవడం లేదు.

Farmers Suffering
రైతుల కష్టాలు

By

Published : May 1, 2023, 8:11 AM IST

Updated : May 1, 2023, 9:38 AM IST

Farmers Suffering: రైతుల ఆవేదన.. ప్రభుత్వానికి పట్టదా..?

Farmers Suffer due to Untimely Rains: ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 147 శాతం అధికంగా వానలు కురిశాయి. ఎండాకాలంలో, అది కూడా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో.. మిరప, మొక్కజొన్న, ధాన్యం, మామిడితోపాటు ఇతర ఉద్యాన పంటల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్చి నెలాఖరులో కురిసిన వార్షాలను.. ఇప్పటి వరకు పరిహారం అందించలేదు. ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయో లెక్కలపై స్పష్టత లేదు. మళ్లీ వానలతో రైతులు మునుగుతున్నారు.


కేవలం మాటలేనా.. రైతులను ఆదుకునే చర్యలు లేవా?:పసుపు ధర పతనమైందని నెల నుంచి రైతులు వాపోతున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు 2 వేల 200 వరకు అమ్మిన మొక్కజొన్న.. ఇప్పుడు 16 వందల స్థాయికి దిగజారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా సీఎం మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాయలసీమలో కిలో టమాటాకు 2 రూపాయల చొప్పున మాత్రమే రైతుకు దక్కుతుండగా.. విజయవాడలో 16 నుంచి 20 రూపాయల చొప్పున వినియోగదారులు కొంటున్నా జగన్‌ సర్కారు కిమ్మనడం లేదు.

భారీవర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాపు రాలిపోతోంది. ఒకవైపు వర్షాల వలన భయం, మరోవైపు ఎదురు సొమ్ము ఇవ్వకపోతే మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనే పరిస్థితి లేక, రవాణా ఏర్పాట్లు లేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దున్న లేచినప్పట్నుంచి రైతు సంక్షేమానికి లక్షా 46 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ సీఎం జగన్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాకాలూదడం తప్పితే.. మార్కెట్‌ జోక్యం ద్వారా రైతులను ఆదుకుందామనే ఆలోచనే లేదు.

రైతుల అగచాట్లు:రాష్ట్రంలో ఏప్రిల్‌ 23 నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న వర్షాలకు పూర్తిగా తడిసింది. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మిరప రైతులు పంటను కాపాడుకునేందుకు అగచాట్లు పడ్డారు. పొలాల్లో కోయాల్సిన మిరప.. తాలుగా మారుతోంది. కల్లాల్లో ఆరబోసిన మిరపపై పరదాలు కప్పినా ఈదురుగాలులకు అవి ఎగిరిపోయి పంట తడిసిపోతోంది. చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మామిడి కాపు ఈదురు గాలులకు రాలిపోయింది.

వర్షాలతో ఒక్కో రైతు ఎకరాకు 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపోతున్నారు.పల్నాడు జిల్లాలోని కొన్ని చోట్ల గాలి వాన బీభత్సం సృష్టించింది. అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, క్రోసూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యింది. N.T.R. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నందిగామ, మైలవరం ప్రాంతాల్లో కళ్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి పూర్తిగా తడిచిపోయింది. అయినా పంటనష్టం అంచనా, సహాయక చర్యల గురించి ప్రభుత్వం పట్టించు కోవడం లేదు.

వేడుకుంటున్న రైతులు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో కురిసిన అకాల వర్షాలకు వరిపైర్లు నేలకొరిగాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రాశులపై పట్టలు కప్పి పంటను కాపుడుకుంటున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

నేలవాలుతోన్న కోతకొచ్చిన వరి : సోమ, మంగళవారాల్లో రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కలిపి పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 147శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతంలో 118శాతం అధిక వానలు పడ్డాయి. అత్యధికంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 488శాతం అధిక వర్షపాతం నమోదు కావడం.. ఎండాకాలంలో వానల తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాలకు డెల్టా ప్రాంతంలో కోతకొచ్చిన వరి నేలవాలుతోంది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి రంగు మారుతోంది.

రైతుల గోడు వినేవారు లేరు: మొక్కజొన్న ధర నెలలోనే క్వింటాకు 600 నుంచి 800 రూపాయల వరకు తగ్గింది. కోతకు ముందు గరిష్ఠంగా క్వింటాలు 2 వేల 300 వరకు పలకగా.. ఇప్పుడు 15 వందల నుంచి 16 వందల మాత్రమే లభిస్తోంది. మద్దతు ధర మాత్రం క్వింటాలుకు 1962 రూపాయలు. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గాయి. అకాల వర్షాలు, ఈదురు గాలులతో కొన్నిచోట్ల పంట నేలకరచింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిచింది.

ఎకరానికి 40వేల వరకు పెట్టుబడిగా పెట్టామని, దిగుబడి 20 క్వింటాళ్ల లెక్కన చూసినా సగటున రూ.30వేలే వస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ధరలు తగ్గిపోయాయని రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా వారి గోడు వినేవారు లేరు. మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో పంట ఆరబెట్టిన రైతులు.. ఇప్పుడు అది కాస్తా వానలకు తడిసిపోయిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

సీఎం మాటలు ఏమయ్యాయి?: ‘టమాటాకు ధర లేక రైతులు రోడ్డుపక్కన పారబోస్తున్నారని తెలుసు. వారికోసం ప్రాసెసింగ్‌ పరిశ్రమలు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని 2017 డిసెంబరులో జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన సీఎం అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. రైతు కష్టాలు తీరలేదు. గుజ్జు పరిశ్రమలు రాలేదు. టమాటాకు కనీస మద్దతుధర కూడా నిర్ణయించలేదు. కోత ఖర్చులూ రావడం లేదని, ఎకరాకు లక్ష రూపాయలు నష్టపోయామని అన్నమయ్య జిల్లాలో రైతులు వాపోతున్నారు. పంటను వదిలేస్తున్నారు. కోసిన కాయల్ని పారబోస్తున్నారు.

ప్రభుత్వానికి పట్టదా?: పసుపు, మొక్కజొన్నకు ధరలు పడిపోయాయా? కొనడానికి తొందరేముంది నిదానంగా చూద్దాం అన్న ధోరణి జగన్‌ ప్రభుత్వంలో కనిపిస్తోంది. టమాటా రైతుకు కిలోకి 2 రూపాయలు కూడా దక్కడం లేదా? ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే.. ఏమీ చేయలేం అన్నట్లు వ్యవహరిస్తోంది. గాలులకు మామిడి కాపు రాలిందా? ఏరుకుని అమ్ముకోండి. వేళ్లతో సహా చెట్లు కూలితే చెప్పండి నష్టంగా రాస్తాం. అని చెబుతోంది. కల్లాల్లో ఆరబెట్టిన మిరప నీట మునిగిందా? ఏం చేయలేం.. పంట కోశాక జరిగిన నష్టానికి సాయం అందించలేమన్న తీరుగా ప్రభుత్వం ఉంది.

ఈదురుగాలులకు మొక్కజొన్న నేల కరచిందా? అదేం పెద్ద నష్టం కాదు. మళ్లీ పైకి లేస్తుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. మొక్కలు సగానికి విరిగిపడితేనే చెప్పండి నమోదు చేస్తాం.. ధాన్యం తడిసిందా? నూక ఎక్కువగా ఉందని మిల్లర్లు సతాయిస్తున్నారా? ఎంతోకొంతకు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోండన్న తీరుగా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇదేనా రైతు సంక్షేమ విధానం అంటే..అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details