Farmers are farming with diesel engines: గుంటూరు జిల్లాలో పంటలకు సాగునీరు అందించే కాలువల్లో గుంటూరు వాహిని ఒకటి. ఈ కాలువకి వట్టి చెరుకూరు, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని చివరి ఆయకట్టు భూములున్నాయి. అయితే అధికారుల ప్రణాళికా లోపం ప్రతిఏటా రైతులకు శాపంగా మారుతోంది. మిర్చి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పంటలను కాపాడుకోవటం కోసం రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేసవి రావటంతో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏమాత్రం తడి లేకున్నా పంటలు ఎండిపోవటం ఖాయం.
ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న పంటలు కోత దశలో ఉన్నాయి. అందుకే నీటి తడుల ద్వారా పంటలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. డీజిల్ ఇంజిన్ల సాయంతో సాగు చేస్తున్నారు, కుంటల్లోని నీరు, మురుగునీటి కాలువలలోని నీటిని తోడి పంటలను తడుపుతున్నారు. దీని కోసం రెండు కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేస్తున్నారు. వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో చాలాచోట్ల ఇలాంటి పైపులైన్లు రోడ్ల వెంట కనిపిస్తున్నాయి. మిర్చి పంట మరో ఒకటి రెండు కోతలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉండటం రైతులను ఊరిస్తోంది. పంట ఎండిపోకుండా కాపాడుకుంటే నాలుగు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే శ్రమపడుతున్నట్లు రైతులు తెలిపారు.