అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఐకాస ఆధ్వర్యంలో నందిగామలో చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ఉద్యమం అంతకంతకూ పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతులు ప్రాణాలు కోల్పోతున్నా... ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... అమరేశ్వరునికి నైవేద్యం
ఆంద్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నందిగామ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని మూడు ముక్కలు చేయవద్దని అమరావతే రాజధానిగా ఉండాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తాడికొండ నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై అమరావతి చేరుకొని... పంచారామ క్షేత్రమైన అమరేశ్వరాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అమరేశ్వరునికి నైవేద్యం సమర్పించి... రాజధాని తరలించకుండా చూడాలని వేడుకున్నారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.