FARMER SUCIDE NO COMPANSATION: అనగనగా అంకమ్మరావు అనే కౌలు రైతు. ఆయన సాగు చేసిన వరి పంట వర్షాలకు నీట మునిగింది. గింజ చేతికి రాక పెట్టుబడంతా వృథా అయింది. చేసిన అప్పుల భారం ఓ వైపు, పంట పోయిందనే బాధ మరోవైపు అంకమ్మరావుని ఆత్మహత్యకు పురిగొల్పాయి. అంకమ్మరావు మరణంతో పుట్టెడు బాధలో ఉన్న అతడి భార్య.. పరిహారం కోసం తిరిగింది, తిరుగుతోంది. ఇంకా తిరుగుతూనే ఉంది. ఇలా రోజులు కాదు, నెలలు కాదు, పన్నెండేళ్లు దాటినా పరిహారం రాలేదు. గుంటూరు జిల్లాకు చెందిన కౌలు రైతు భార్య పుష్కర కాలం పైగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న వైనంపై ప్రత్యేక కథనం మీకోసం..
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన నన్నం అంకమ్మరావుకు.. సొంత పొలం లేదు. 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. 2010లో పొలంలో వరిసాగు పెట్టుబడుల కోసం రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. పైరు కోతకు వచ్చింది. కొద్ది రోజుల్లో కోయాల్సి ఉండగా అధిక వర్షాలు కొంప ముంచాయి. పైరు నీట మునిగింది. అంకమ్మరావు గుండె చెరువైంది. పంట దక్కదని అర్థమైంది. దీంతో పొలంలోనే పురుగుల మందు తాగి తనవు చాలించాడు.
2010 డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల జాబితాలో అంకమ్మరావు పేరు చేరింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. అంకమ్మరావు భార్య మరియమ్మ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివరాలు తీసుకున్నారు. కానీ పరిహారం మాత్రం రాలేదు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ మరియమ్మ తిరుగుతూనే ఉంది. 2015లో స్పందనలో కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుంది. దీంతో ఆయన అధికారుల్ని మరోసారి అక్కడికి పంపించి వివరాలు తీసుకున్నారు. పరిహారం తప్పకుండా వస్తుందని మరియమ్మ ఆశించింది. అయితే ఆమె ఆశ అడియాసే అయ్యింది. పన్నెండేళ్లైనా పరిహారం రాలేదు గానీ.. కాగితాల ఖర్చులు, కాళ్ల నెప్పులు మాత్రం మిగిలాయి.