ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వినుకొండ ఎమ్మెల్యే నన్ను చెప్పుతో కొట్టబోయారు... అతనితో నాకు ప్రాణహాని ఉంది'

Farmer Narendra issue: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లాకు చెందిన రైతు గడిపూడి నరేంద్ర అన్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరపడం లేదని ప్రశ్నించినందుకు తనపై దాడి చేయడమేగాక... తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmer Narendra Arrest issue
Farmer Narendra Arrest issue

By

Published : Jan 19, 2022, 12:58 PM IST

Farmer Narendra issue: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏర్పడిన ఇబ్బందులు, గిట్టుబాటు ధర లభించకపోవడాన్ని ప్రశ్నించడమే ఆ రైతు చేసిన పాపమైంది. అన్నదాతల బాధలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన రైతు జైలు పాలుకావాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన రైతు గడిపూడి నరేంద్ర.. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పీఏపై హత్యాయత్నం చేశారని రైతు నరేంద్రపై కేసు నమోదు చేసి జైలుకు సైతం పంపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు తలెత్తడంతో.. ఉన్నతాధికారులు విచారణ జరిపారు. వినుకొండ గ్రామీణ సీఐ అశోక్ కుమార్ తొందరపాటు చర్య వల్లే రైతును అరెస్ట్ చేసినట్లు తేల్చారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అశోక్ కుమార్​ని సస్పెండ్‌ చేశారు. దీంతో రైతు నరేంద్రపై అక్రమంగా కేసు పెట్టారనే విషయం పోలీసులే పరోక్షంగా అంగీకరించారు. రైతు నరేంద్రకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.


సొంత పార్టీ కార్యకర్తలపైనే నేతలు దాడి..

తన కుటుంబ సభ్యులంతా తెలుగుదేశంలో ఉన్నా.. తాను మాత్రం జగన్‌ను అభిమానించి వైకాపా కోసం పనిచేశానని నరేంద్ర తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే నేతలు దాడి చేయడం.. తప్పుడు కేసులు పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. ఎమ్మెల్యే పీఏ ఆంజనేయులు ఎవరో కూడా తనకు తెలియదన్న నరేంద్ర.. అతనిపై హత్యాయత్నం ఎలా చేస్తానని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో తనకు ప్రాణహాని ఉందని నరేంద్ర వెల్లడించారు. నరేంద్ర అరెస్ట్ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చంద్రబాబు సహా పలువురు తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్ సైతం ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో గిట్టుబాటు ధర గురించి స్థానిక ఎంపీ కృష్ణదేవరాయలుతో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. నాపై కోపంతో చెప్పుతో కొట్టబోయారు. నేను చెప్పేది అబద్ధం అయితే వినుకొండ మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు ఎమ్మెల్యే తన కుటుంబంతో వచ్చి ప్రమాణం చేయమనండి. లేదంటే నేను చేస్తా. సొంత పార్టీ కార్యకర్తలపైనే నేతలు దాడి చేయడం.. తప్పుడు కేసులు పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నా. ఎమ్మెల్యే పీఏ ఆంజనేయులు ఎవరో కూడా నాకు తెలియదు. అతనిపై హత్యాయత్నం నేను ఎలా చేస్తా. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో నాకు ప్రాణహాని ఉంది. గడిపూడి నరేంద్ర, గుంటూరు జిల్లా రైతు

వినుకొండ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందన్న గుంటూరు జిల్లా రైతు గడిపూడి నరేంద్ర

ఇదీ చదవండి:కడప కలెక్టరేట్‌లో విశ్రాంత ఏఎస్సై కుమారుడి వీరంగం.. కత్తితో బెదిరిస్తూ...

ABOUT THE AUTHOR

...view details