రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న అరటి తోటలో మోకాలు లోతు నీరు. పండిన పంటను బయటకు తీసుకురావడానికి కూలీ తడిసి మోపెడవుతోంది. దీనికి తోడు తోట వెంట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన రైతు నగేష్ ఓ వినూత్న ఆలోచన చేశారు.
తోటలో కోసిన సుమారు 60 అరటి గెలలను తోరణాల్లా తాడుకు కట్టారు. దానిని పట్టుకుని వరద ప్రవాహంలో వాలు వైపు అరటి డొప్పపై తేలియాడుతూ కిలోమీటరు మేర మరొకరి సాయంతో తీసుకొచ్చి ఒడ్డుకు, అక్కడ నుంచి రోడ్డుకు చేర్చారు. దీంతో గెలకు 25 రూపాయలు చొప్పున అయ్యే కూలీతోపాటు రవాణా ఛార్జీలు కలిసొచ్చాయి.