ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ మందులొస్తున్నాయా? 'ఫార్మర్ కనెక్ట్'​ యాప్ ఇన్​స్టాల్ చేయండి!

నకిలీ పురుగుమందులు అన్నదాతల్ని నట్టేట ముంచుతున్నాయి. పంటలకు పట్టిన చీడలు వదిలించటం సంగతి అటుంచి... రైతులకు వేలాది రూపాయలు నష్టం చేకూరుస్తున్న పరిస్థితి. అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రం కావటం, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు లేకపోవటంతో నకిలీలు.. ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో పురుగుమందుల కంపెనీలు ఆధునిక సాంకేతికతతో ముందుకొస్తున్నాయి. తమ కంపెనీ మందులు అసలా, నకిలీనా తేల్చేందుకు మొబైల్ యాప్, క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

నకిలీ మందులొస్తున్నాయా? అయితే 'ఫార్మర్ కనెక్ట్'​ యాప్ ఇన్​స్టాల్ చేయండి!
నకిలీ మందులొస్తున్నాయా? అయితే 'ఫార్మర్ కనెక్ట్'​ యాప్ ఇన్​స్టాల్ చేయండి!

By

Published : Dec 5, 2020, 9:37 PM IST

పంటల సాగు సమయంలో రైతులు పెట్టే పెట్టుబడుల్లో ఎరువులు, పురుగుమందులదే అగ్రస్థానం. చీడపీడలు నివారించే క్రమంలో పురుగుమందులు వాడినా కొన్నిసార్లు అవి సరిగా పనిచేయటం లేదు. దీంతో రైతులు మరోసారి పిచికారీ చేయాల్సి వస్తోంది. ఈలోగా పంట నాశనమైపోతుంది. అలాగే రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. రెండు విధాలుగా కర్షకులకు నష్టం చేకూర్చే నకిలీ పురుగుమందుల వ్యవహారం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉంది.

సాంకేతిక సాయంతో..

వ్యవసాయానికి కీలకంగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పురుగుమందుల వినియోగం ఎక్కువ. అదే క్రమంలో ఇక్కడ నకిలీలు యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సమయంలో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. నకిలీ పురుగుమందుల విక్రేతల్ని అరెస్టు చేసినా.. వారు జరిమానా చెల్లించి బయటకు వస్తున్నారు. వేరే కంపెనీ పేరుతో మళ్లీ నకిలీలు తయారు చేయటం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితి అన్నదాతలకే కాకుండా పురుగుమందులు తయారు చేసే కంపెనీలకు కూడా సవాల్​గా మారింది. అయితే ఆధునిక సాంకేతికత సాయంతో పురుగుమందులు అసలా, నకిలీనా అని తేల్చేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

నకిలీ అయితే..

కొర్టెవా కంపెనీ తమ ఉత్పత్తులపై క్యూ ఆర్ కోడ్ ముద్రిస్తోంది. రైతులు తమ వద్ద ఉండే స్మార్ట్ ఫోన్​లో ఫార్మర్ కనెక్ట్ మొబైల్ యాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలి. యాప్ ద్వారా క్యూ ఆర్ కోడ్​ని స్కాన్ చేస్తే... అది కంపెనీది అయితే ఆకుపచ్చ రంగులో టిక్ మార్క్ చూపిస్తుంది. ఒకవేళ నకిలీ అయితే X గుర్తు వస్తుంది.

ఫార్మర్ కనెక్ట్​

రైతులు స్మార్ట్ ఫోన్​లో ఫార్మర్ కనెక్ట్ యాప్ వినియోగించి పురుగు మందులు అసలా లేక డూప్లికేటా అని తెలుసుకోవచ్చు. పైగా ఈ విధానాన్ని రైతులకు పరిచయం చేసేందుకు కంపెనీలు.. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు కంపెనీల ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పురుగు మందుల దుకాణాల వద్దకు వచ్చే రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తమ కంపెనీ నుంచి తయారైన ఉత్పత్తులు ఎక్కడ కొన్నా... ఇలా తనిఖీ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రైతులు కూడా ఈ విధానం బాగుందని చెబుతున్నారు. డీలర్ ఇచ్చే పురుగుమందు తీసుకెళ్లి కొట్టడం తప్ప చాలామంది రైతులకు అవగాహన ఉండదని... ఇపుడు మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకునే అవకాశం రావటం బాగుందని అంటున్నారు.

అవగాహన పెంచుకోవాలి

వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. నకిలీల బెడద నుంచి రైతులను కాపాడేందుకు కంపెనీలు ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నారు. కొత్త విధానం పట్ల రైతులు అవగాహన పెంచుకుని నకిలీ బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ఇలాంటి సాంకేతికతను పాటిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఇలా సాంకేతికతతో ముందుకు వస్తే నకిలీల నుంచి రైతులు ఇబ్బందులు పడకుండా చూడవచ్చని అధికారులు చెబుతున్నారు.

స్కాన్ చేస్తే.. ఆఫర్

కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన వారి బ్యాంకు ఖాతాకు నగదుని బదిలీ చేస్తున్నారు. ఫోన్ నంబరు బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటే సరిపోతుంది. 50 నుంచి 100 రూపాయలు కంపెనీ రైతుకు తిరిగి చెల్లిస్తోంది. అయితే ఇలాంటి ఆఫర్లు కొద్ది కాలం మాత్రమే ఉంటాయని తెలియజేస్తున్నారు.

ఇదీ చదవండి:పర్యాటక స్వర్గధామం విశాఖ మన్యం..ప్రత్యేకతలు ఏంటంటే

ABOUT THE AUTHOR

...view details